ANDRAPRADESH, AMARAVATHI: ఏపీ కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల సరైన రూట్లో రాజకీయం ఇపుడు చేస్తున్నారు. ఆమెలో ఇపుడు అసలైన ఫైర్ బయటకు వస్తోంది. అది ఎవరిని టార్గెట్ చేయాలో వారిని చేస్తోంది. గత ఏడాది తెలంగాణాలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధినేత్రి గా బాధ్యతలు తీసుకున్న షర్మిల అన్న జగన్ ని లక్ష్యంగా చేసుకుని రాజకీయం రక్తి కట్టించారు.
అప్పటికి జగన్ ఏపీ సీఎం గా ఉండడంతో షర్మిల రాజకీయం బాగా పండింది. అయితే అది కాంగ్రెస్ కి కానీ ఆమెకు కానీ వీసమెత్తు కూడా ఉపయోగపడకపోగా అప్పటికే బాగా పుంజుకున్న టీడీపీ కూటమిని మరింతగా యాడ్ అయింది. దాంతో ఏపీలో దారుణమైన ఫలితాలను వైసీపీ చవిచూసింది. మరీ ముఖ్యంగా వైసీపీకి హార్డ్ కోర్ రీజియన్ గా చెప్పబడే రాయలసీమలో ఆ పార్టీ జాతకం తల్లకిందులు అయింది.
ఇక ఏపీలో కేవలం 18 అసెంబ్లీ సీట్లు కూడా దక్కించుకుని ప్రతిపక్ష స్థానం కూడా సాధించలేని నిస్సహాయ స్థితిలోకి వైసీపీ వచ్చింది అంటే దాని వెనక షర్మిల ఎఫెక్ట్ చాలానే ఉంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. రాయలసీమలో తక్కువ మార్జిన్ తో చాలా సీట్లు వైసీపీ కోల్పోవడం అంటే ఆయా ఓట్ల చీలిక వెనక షర్మిల ఉందని కూడా చెప్పుకున్నారు.
అలా ఎన్నికలు ముగిసి ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినా సరే షర్మిల అన్న జగన్ నే టార్గెట్ చేస్తూ ముందుకు సాగారు. ఆమె ఏ అంశం మీద మాట్లాడినా అధికారంలో ఉన్న టీడీపీ కూటమిని తమలపాకుతో కొడుతూ వైసీపీని మాత్రం తలుపు చెక్కతో కొట్టేవారు. దాంతో ఆమె కూటమిని అనుకూలం అన్న భావన ఏర్పడింది.
దానినే వైసీపీ నేతలు కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. అది కాస్తా కాంగ్రెస్ లో ఆమె పట్ల కొంత వ్యతిరేకత రావడానికి కారణం అయింది. ఈ నేపథ్యంలో గత కొద్ది నెలలుగా షర్మిల రూట్ మార్చారు. పొలిటికల్ గా తన స్టాండ్ ఏంటి అన్నది చెప్పేశారు. ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ ఫిలాసఫీని ఆమె ఏపీలో అమలు చేస్తున్నారు.
దాంతో జగన్ మీద విమర్శలు తగ్గిపోయాయి. అదే సమయంలో కూటమిని ఆమె గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. దానికి మించి మోడీని ఆమె నేరుగా ఢీ కొడుతున్నారు. వక్ఫ్ చట్టం సవరణ విషయంలో ఆమె మోడీని ఆయన ప్రభుత్వ విధానాలను పూర్తిగా తప్పుపట్టారు.
ఏపీ నుంచి అంత గట్టిగా వాయిస్ వినిపించి మైనారిటీలకు అండగా నిలిచిన పార్టీగా కాంగ్రెస్ ని ముందుంచారు. ఆ తరువాత కాశ్మీర్ లో ఉగ్ర దాడి జరిగితే అందరూ పలు విధాలుగా రియాక్ట్ అయ్యారు. షర్మిల మాత్రం ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం అని మోడీ మీద విరుచుకుపడ్డారు. కేంద్ర నిఘా సంస్థలు అన్నీ ప్రతిపక్షాల మీదనే పనిచేస్తున్నాయని అందుకే సరిహద్దులలో ఈ ఘోరాలు అని ఘాటైన పదజాలంతో విమర్శించారు.
ఇంకో వైపు చూస్తే కనుక అమరావతి మోడీ టూర్ మీద అసలు సిసలు విపక్ష పాత్రను షర్మిల పోషించారు. ఏపీ రాజధానికి మోడీ ఏమిచ్చారు అని సూటిగా నిలదీశారు. 2015లో అమరావతికి వచ్చిన మోడీ జనం నోట్లో మట్టి కొట్టారని ఈసారి వారి ముఖాన సున్నం కొట్టారని షర్మిల పేల్చిన ఈ డైలాగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆమె ఎంతో డేరింగ్ గా మోడీ మీద విమర్శలు చేస్తున్నారు. ఏపీకి మోడీ ఏమిచ్చారు అని ఆమె అడుగుతున్న తీరు సగటు జనాలలో ఉన్న ప్రశ్న కాబట్టి బాగా రీచ్ అవుతోంది. అంతే కాదు ఆమె మోడీ ప్రభుత్వ విధానాలను ఏపీ నుంచి పూర్తిగా ఎండగడుతూ యాంటీ మోడీ పాలిటిక్స్ లో ఫోర్ ఫ్రంట్ లో ఉంటున్నారు.
అదే ఏపీలో పెద్ద పార్టీ ప్రతిపక్షంలో మేమే ఉన్నామని చెప్పుకునే వైసీపీ తీరు చూస్తే రాజకీయ ప్రదర్శన అనుకున్న స్థాయిలో లేదనే అంటున్నారు. మోడీని విమర్శించేందుకు కూడా వైసీపీ ఆలోచిస్తోంది అన్న సంకేతాలే ఇస్తున్నారు. మోడీ ఏపీకి ఏమీ చేయకపోయినా ఇదేమిటి అని ప్రశ్నించేందుకు వైసీపీ సిద్ధంగా లేదని అంటున్నారు. కానీ షర్మిల మాత్రం మోడీని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు.
ఇది భవిష్యత్తులో కాంగ్రెస్ కి ఏపీలో ఎంతో కొంత ఉపయోగపడవచ్చు అని అంటున్నారు. ఇదే తీరున షర్మిల ఏపీలో అధికార పార్టీని కేంద్రంలో మోడీ సర్కార్ ని టార్గెట్ చేసుకుంటూ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే కనుక కాంగ్రెస్ నెమ్మదిగా లేచి కూర్చునే చాన్స్ ఉంటుందని అంటున్నారు. వైసీపీ పరిధిలు పరిమితులు పెట్టుకుని చేసే రాజకీయం కంటే ఏ జంకూ గొంకూ లేకుండా చెల్లెమ్మ చేస్తున్న దూకుడు ఎంతో బెటర్ అన్న మాట వినిపిస్తోంది.