ఏలూరు: వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంతో అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. బుధవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై గ్రూప్ కన్వీనర్లకు , అధికారులకు అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పాధకతను మెరుగుపర్చడంలో, ఖర్చులను తగ్గించడంలో, సమర్ధతను పెంచడంలో డ్రోన్లపాత్ర ఎంతో ముఖ్యమైనదన్నారు. వ్యవసాయ సాగులో డ్రోన్ టెక్నాలజీతో అన్నదాతకు ఆసరాగా నిలవాలని ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. ఈ నేపద్యంలో జిల్లాలో 27 మండలాల్లో తొలివిడతగా ప్రభుత్వ సబ్సిడీపై డ్రోన్ల ను అందించేందుకు ధరఖాస్తులు తీసుకోవడం జరుగుతుందవ్నారు.
తొలివిడతగా 40 డ్రోన్లను ప్రభుత్వం జిల్లాకు కేటాయించిందన్నారు. వీటిని కొనుగోలుకు రైతులకు ప్రభుత్వం 50 శాతం వరకు సబ్సిడీని అందిస్తుందన్నారు. ఇందులో ఇప్పటికే 31 మంది ధరఖాస్తులు చేసుకున్నారన్నారు. రైతు గ్రూపులు, మనుగడలో ఉన్న ఎఫ్ పివోల్లో డ్రోన్ల నిర్వహణపై ఆసక్తి కలిగిన వారికి అందించడం జరుగుతుందన్నారు. 10 నుంచి 15 గ్రామాలను క్లస్టర్ గా నిర్ణయించడం జరిగిందన్నారు. డ్రోన్ల నిర్వహణలో ఇప్పటికే డ్రోన్ పైలేట్ ఉచిత శిక్షణను అందించడం జరిగిందని అయితే ఈ రంగంలో మహిళలను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
సబ్సిడీపై డ్రోన్లు పొందేందుకు మొదటిగా బ్యాంకుల్లో మొండిబకాయిలు లేని గ్రూపులోని 5గురు సభ్యులు బ్యాంకు ఖాతా తెరవవలసివుంటుందన్నారు. ఇందుకు సంబంధించి మొత్తం ప్రక్రియను బ్యాంకు అధికారులు ఎటువంటి ఆలస్యం చేయకుండా పూర్తి సహకారం అందించాలన్నారు. ఈ సందర్బంగా శిక్షణ తీసుకున్న డ్రోన్ పైలేట్ రైతులతో డ్రోన్ల నిర్వహణపై పలు ప్రశ్నలు వేసి వారి నుంచి సమాధానం రాబట్టారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాలు, డ్రోన్ల వినియోగంపై స్పష్టత ఉండాలని సూచించారు. డ్రోన్లు తీసుకున్న రైతులు విజయవంతంగా ఎదగాలని ఈ సందర్బంగా కలెక్టర్ ఆకాంక్షించారు.
సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి హబీబ్ భాషా, ఎపిఎంఐపి పిడి పి. రవికుమార్, ఎల్ డిఎం డి. నీలాధ్రి, వివిధ బ్యాంకుల అధికారులు, శిక్షణ పొందిన డ్రోన్ పైలేట్ రైతులు, పలువురు వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.