సప్లమెంటరీ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్ధులు ప్రత్యేక తరగతులు సద్వినియోగం చేసుకోవాలి..
08812230197 ఫోన్ నెంబరుతో కంట్రోల్ రూమ్..
జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి..
ఏలూరు: జిల్లాలో ఈనెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియేట్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ విద్యార్ధులకు ఎటువంటి అసౌకర్యం కలుగుకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇంటర్మీడియేట్ మొదటి ఏడాది సప్లమెంటరీ పరీక్షలకు జనరల్, ఒకేషనల్ కు 10,068 మంది విద్యార్ధులు, రెండవ సంవత్సరం జనరల్ ఒకేషనల్ కోర్సులకు 3,035 మంది విద్యార్ధులు పరీక్షలు వ్రాసేందుకు 34 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద ఫస్ట్ ఎయిడ్ కిట్లు, ఎఎన్ఎంలను అందుబాటులో ఉంచాలన్నారు.
నిరంతరం విద్యుత్ సరఫరాకు ముందస్తు ఏర్పాట్లు చూడాలన్నారు. త్రాగునీరు అందుబాటులో ఉంటాలన్నారు. సెల్ ఫోన్లు అనుమతించబడవన్నారు. పిల్లల భవిష్యత్ కోసం సప్లమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు అన్ని కళాశాలల్లో రెమిడియల్ తరగతులు నిర్వహించడం జరుగుతుందని, పిల్లలందరూ ఆ శిక్షణా తరగతులకు హాజరై ఉత్తీర్ణులు కావాలని కలెక్టర్ సూచించారు. ఈ తరగతుల నిర్వహణ తీరును తాను ఆకస్మిక తనిఖీచేసి పరిశీలిస్తానన్నారు.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులందరూ ఉత్తీర్ణులయ్యేలా విద్యాశాఖ అధికారులు కృషిచేయాలన్నారు. ఆర్ టి సి అధికారులు పరీక్షల సమయాలకు అనుగుణంగా విద్యార్ధులకు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. పరీక్షా కేంద్రాల పరిధిలో సెక్షన్-163బి సెక్షన్ అమలు చేయాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలు సిసి కెమేరాల నిఘాలో ఉంటాయన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కేంద్రంలో 08812230197 ఫోన్ నెంబరుతో కంట్రోల్ రూమ్ నిర్వహించడం జరుగుతుందన్నారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టమైన భధ్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ఫ్లైయింగ్ స్వాడ్ లు, సిట్టింగ్ స్వాడ్ లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద మహిళా పోలీసులను అందుబాటులో ఉంచాలన్నారు.
సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఆర్ఐఓ కె. యోహాన్, డిఐఇవో టి. శేఖర్ బాబు, డిపివో కె. అనురాధ, ఆర్ టిసి డిఎం బి. వాణి, కొయ్యలగూడెం, కుక్కునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్స్ ఎల్ శ్యామ్ కుమార్, కె. శ్రీనివాసరావు, విద్యుత్, పోస్టల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.