ANDRAPRADESH: ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మరికొన్ని రోజులు ఇలాంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శుక్రవారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
అలాగే విశాఖపట్నం,అనకాపల్లి జిల్లా, గోదావరి జిల్లాలు, నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. పిడుగులు పడే అవకాశమున్న నేపథ్యంలో ప్రజలు చెట్ల క్రింద నిలబడవద్దని సూచించారు. బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. ఈదురుగాలుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 నుంచి 42.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. గురువారం ప్రకాశం జిల్లా దరిమడుగులో 42.4 డిగ్రీలు. వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో 42.1 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా పూతనవారిపల్లెలో 41.3° డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలని... గొడుగు ఉపయోగించాలని జాగ్రత్తలు చెప్పారు.
మరోవైపు ఏపీలో మే నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు జిల్లాలు మినహా మిగతా రాష్ట్రమంతటా సాధారణంగా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఎండలతో పాటుగా వర్షాలు కూడా మే నెలలో సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తోంది. ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని..
ఈ ఆవర్తనం ప్రభావంతో మరో మూడు రోజులు కోస్తాంధ్రలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల మధ్యలో ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.