డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, రామచంద్రపురం, బ్యూరో: రామచంద్రపురం బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా సీనియర్ అడ్వకేట్ ఉండవల్లి గోపాలరావు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఈ మేరకు సోమవారం జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలకు సీఈఓగా ఉన్న టిఎస్ఎస్ చలపతి విజేతల పేర్లను ప్రకటించారు.
ఏడాది కాలపరిమితి గల బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల్లో ఆరు పదవులకు ద్విముఖ పోటీ నెలకొంది. అధ్యక్ష పదవికి మామిడిపల్లి వెంకటసుబ్బారావు, ఉండవల్లి గోపాలరావులు పోటీపడ్డారు. మొత్తం 164 ఓట్లకు గానూ 155 పోలవ్వగా వాటిలో 3 ఓట్లు చెల్లని ఓట్లు వచ్చాయి. ఉండవల్లికి 137 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి వెంకట సుబ్బారావుకు కేవలం 15 ఓట్లు వచ్చాయి. దాంతో గోపాలరావు 122 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు.
అలాగే ఉపాధ్యక్షులుగా గోవర్ధనం మల్లేశ్వరరావు 55, జనరల్ సెక్రటరీగా బొడ్డు వరాహనరసింహ మూర్తి 6 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక జాయింట్ సెక్రటరీగా పోటీ చేసిన ఎన్. వి.వి.శేషు కుమార్, పీవీఎస్. జానకిలకు సరి సమానంగా ఓట్లు రావడంతో ఇద్దరినీ జాయింట్ సెక్రటరీలుగా ఖరారు చేశారు. కోశాధికారిగా చింతపల్లి శ్రీనివాసరావు 69 ఓట్లు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా సాదే నారాయణరావు 11 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
కాగా లేడీ రిప్రజంటేటివ్ లకాని పద్మ కమల కుమారిని ఏకగ్రీవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. నూతనంగా ఏర్పడిన బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని మంగళవారం సీనియర్ న్యాయవాది మల్లిడి హరినాథ్ రెడ్డి చే ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన కార్యవర్గాన్ని సీనియర్ కమ్యూనిస్టు నేత డాక్టర్ స్టాలిన్, పిల్లి సూర్యప్రకాష్ తదితర ప్రముఖులు అభినందించారు.