Hot Posts

6/recent/ticker-posts

వచ్చే మూడ్రోజులు పిడుగులతో కూడిన వానలు..


ANDRAPRADESH: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులు పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. మంగళవారం నుంచి గురువారం వరకూ పలు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని.. ఇలాంటి సమయాల్లో చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు. 


ఇక మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

మరోవైపు వచ్చే మూడు రోజులు ఏపీలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

మరోవైపు కోస్తాంధ్ర మధ్య ప్రాంతం, యానాం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని దీని ప్రభావంతో వచ్చే మూడు రోజులు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కోస్తాలో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని.. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

దక్షిణ కోస్తాలోనూ రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రాయలసీమ విషయానికి వస్తే వచ్చే మూడు రోజులు మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు అకాల వర్షాలతో పలుచోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now