Dr. BR Ambedkar Konaseema, రామచంద్రపురం, బ్యూరో: స్థానిక బలుసు వెంకట్రాయిడు కళ్యాణ పండపం నందు శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఆహ్లాదకర మైన వాతావరణంలో వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూలు వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వికాస్ విద్యాసంస్థల కరస్పాండెంట్ లయన్ వి.వి. రమణ అధ్యక్షతన జరిగిన పాఠశాల వార్శికోత్సవ సభలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల మరింత స్నేహభావంతో మెలుగుతూ వారిని ఉత్తమ పౌరులుగానూ, సంస్కారవంతులు గానూ తీర్చిదిద్దాలని తెలియజేశారు. అలాగే సమాజంలోని నిరుపేద విద్యార్థులకు సైతం అందుబాటులో ఉండేలా వికాస్ స్కూలు ఫీజులు ఉంటాయని ఈ సందర్భంగా లయన్ వి.వి. రమణ పేర్కొన్నారు.
తమ పాఠశాల ఇంతగా అభివృద్ధి చెందడానికి కారణం నూటికి నూరుపాళ్ళూ విద్యార్థుల తల్లిదండ్రుల ప్రోత్సాహమేనని ఆయన కితాబిచ్చారు. వికాస్ స్కూలు, కళాశాలలు ఇంతగా అభివృద్ధి చెందడానికి తమ విద్యార్థుల తల్లిదండ్రుల అమూల్యమైన సలహాలు, సూచనలే కారణమని వికాస్ విద్యాసంస్థల అధినేత లయన్ వాసంశెట్టి వెంకటరమణ ఈ సందర్భంగా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
వికాస్ కళాశాల ప్రిన్సిపాల్ ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ ఒక భవంతికి పునాది ఎంత ముఖ్యమో అలాగే పిల్లవాడికి నర్సరీ నుండి పటిష్టమైన విద్యాబోధన కూడా అంతే ముఖ్యమని ఆమె తెలిపారు. వార్షికోత్సవాన్ని తిలకించేందుకు విచ్చేసిన అతిథులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ఝాన్సీ లక్ష్మి తగు ఏర్పాట్లు చేశారు.
వికాస్ స్కూలు వార్షికోత్సవంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులు అందరినీ ఆకట్టుకున్నాయి. చివరిగా జనగణమన జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.