డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, రామచంద్రపురం, బ్యూరో: రామచంద్రపురం మండలం భీమక్రోసుపాలెంలో జరిగిన ఒక సంఘటనపై ద్రాక్షారామ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదును విచారించకుండా ఫిర్యాదు దారులపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని, వాటిపై విచారణ జరపించి నిజా నిజాలు తేల్చాలని, తప్పు చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని రాజ్యసభ సభ్యులు వైఎస్‌ఆర్ సీపీ పీఏసీ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం డిఎస్పీ రఘువీర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఈమేరకు పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో ఆదివారం డిఎస్పీ రఘువీర్‌ను ఎంపీ బోస్, సూర్యప్రకాశ్ ఇతర వైఎస్‌ఆర్ సీపీ నేతలు కలిసి వివరాలను అందజేశారు. ఇటీవల భీమక్రోసు పాలెంలో జరిగిన సంఘటనను గ్రామ సర్పంచ్ పలివెల లోవరాజు, భాదితుడు పెనుమళ్ల లక్ష్మణరెడ్డి తదితరులతో కలిసి డిఎస్పీ రఘువీర్‌కు వివరించారు. ఈనెల 8న గ్రామానికి చెందిన లక్ష్మణరెడ్డి గ్రామంలోని ఒక చెరువు వద్దకు వెళ్లి చేతులు కడుక్కొంటుండగా అదే గ్రామానికి చెందిన కూనిశెట్టి వీరేంద్రరెడ్డి దుర్భాషలాడుతూ తనపై కత్తితో దాడి చేసినట్లు వివరించారు.
ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పినందుకువ తిరిగి మరో సారి కత్తితో దాడి చేసి భయభాంత్రులకు గురిచేసినట్లు చెప్పారు. ఇదే విషయాన్ని ద్రాక్షారామ పోలీసులకు ఫిర్యాదు చేయగా మూడు రోజులపాటు తిప్పించుకుని కేసు నమోదు చేశారని, అయితే కౌంటర్ కేసుగా వీరేంద్రరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గ్రామంలో లేని వారిపై కూడా కేసులు పెట్టడం అన్యాయమని వారు డిఎస్పీకి వివరించారు. గ్రామంలో తనపై దాడి చేస్తున్న సమయంలో చాలా మంది చూశారని వారందరినీ విచారణ చేయాలని వారు కోరారు.
ఈ సందర్బంగా కో ఆర్డినేటర్ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ జరిగిన సంఘటనను విచారించకుండా ఎవరైతే భాదితులున్నారో వారిపై కేసులు కట్టడం ఎంత వరకు సమంజసమని డిఎస్పీకి వివరించారు. గతంలో నియోజకవర్గంలో వెల్ల సావరం లేవుట్ వద్ద ఇసుకను కొంత మంది దొంగిలించుకుపోతే ఆ కేసును కూడా ద్రాక్షారామ కేసులు నీరుగార్చే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఎంపీ బోస్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇటీవల కౌంటర్ కేసుల ఆనవాయితీ ఎక్కవగాఉందన్నారు.
తప్పు జరిగితే తప్పును తప్పుగానే చెప్పాలని భాదితులకు న్యాయం చేసే విధంగా పోలీసులు వ్యవహరించాలని ఎంపీ బోస్ సూచించారు. ఈ సందర్బంగా డిఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ తాను స్వయంగా విచారణ చేసి భాదితులకు న్యాయం చేస్తామని ఎంపీ బోస్‌కు తెలియజేశారు. పార్టీ పట్టణ కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్, మండల వైస్ ఎంపీపీ శాఖా బాబి, కౌన్సిలర్‌లు కేతా శ్రీను, తోట సూరిబాబు పార్టీ నేతలు మట్టా బాబులు, వేల్పూరి రాంబాబు, బండి త్రిమూర్తులు, శీలం గంగరాజు, కూనిశెట్టి ప్రకాశ్ రెడ్డి, చిట్టూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.