ANDRAPRADESH: వైసీపీ అధినేత జగన్ కోణంలో నుంచి రాజకీయాలు చేస్తారు. ఆయన అనుకున్నట్లుగానే అంతా సాగాలని అనుకుంటారు. జగన్ ని అంతా పక్కా బిజినెస్ మాన్ అని అంటారు. ఆయన ఆలోచనలు విధానాలు అన్నీ బిజినెస్ లో అయితే పెర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి. అదే రాజకీయాల్లోకి అప్లై చెస్తే మాత్రం ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే రాజకీయం అంటేనే ప్రజలతో ముడిపడి ఉన్నది.
పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా వారంతా ప్రజల నుంచి వచ్చిన వారు ప్రజలలో భాగంగా ఉన్న వారు. ఇక రాజకీయాలు అన్నది ఎపుడూ ఒకే విధంగా సాగవు. అవి నిరంతర ప్రవాహం లాంటివి. వాటి విషయంలో సక్సెస్ చూడాలీ అంటే ప్రజలకు అనుగుణంగా నాయకులు కూడా మారాల్సి ఉంటుంది. బేసిక్స్ లో మార్పు చేసుకోకపోయినా పార్టీ ఫిలాసఫీలో చేంజ్ లేకపోయినా ఫర్వాలేదు. కానీ జనాలను ఆకట్టుకునే విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్త పంధాను అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ మాటకు వస్తే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి కాక ముందు 1995 కి ముందు చంద్రబాబు చాలా రిజర్వ్ గా ఉండేవారు అని అంటారు. ఆయన మైకు ముందు కూడా ఎక్కువ సేపు ప్రసంగించేవారు కాదు. అలాంటిది ఒకసారి సీఎం అయ్యాక పార్టీ అధినేత అయ్యాక చూస్తే ఆయనలో ఎంత మార్పు వచ్చిందో అనిపిస్తుంది. ఈ రోజుక బాబు కంటే అప్టూ డేట్ గా ఉన్న వారు ఎవరూ లేరు. ఆయన మాదిరిగా జనంతో మమేకం అయ్యేవారూ లేరు. ఇక ఆయన స్పీచ్ విషయంలో కూడా రొటీన్ అని అంతా అనుకుంటున్నా ఆయన చాలా ప్లాన్ గా చెప్పాల్సిన విషయాలు అన్నీ ఎప్పటికప్పుడు చెబుతూ వారి మదిలో ఉండేలా చూసుకుంటారు.
అదే జగన్ విషయానికి వస్తే రిజర్వ్ గా ఉంటారని పార్టీ నాయకులు అంటారు. రాజకీయాల్లో ఎంత ఎక్కువగా జనంతో కలిస్తే అంతలా పాపులారిటీ పెరుగుతుంది. అలాగే పార్టీ క్యాడర్ ని ఎంతలా చేరదీస్తే నాయకుడు అంతలా ఎలివేట్ అవుతారు. జగన్ ఈ విషయంలో అన్నీ తెలిసినా ఎందుకో 2019 నుంచి 2024 మధ్యలో మాత్రం పరదాలు వేసుకుని ఉండిపోయారు అన్న చర్చ అయితే ఉంది. జగన్ ని కలిసే విషయంలో నాయకులే ఇబ్బంది పడ్డారని వార్తలు వచ్చాయి ఇక క్యాడర్ కి అయితే అసలు వీలే లేదు అన్నది ఆనాటి ప్రచారం. అందుకేనేమో పార్టీ మీద ఎంత అభిమానం ఉన్నప్పటికీ క్యాడర్ మాత్రం 2024 ఎన్నికల్లో కసిగా పని చేయలేదు. ఫలితం దారుణంగా వచ్చింది.
బహుశా ఈ విషయం జగన్ కి అర్ధం అయ్యే ఉంటుంది. అందుకే ఆయన ఇక మీదట అంతా కార్యకర్తలకే అని అంటున్నారు. ఈసారి అధికారంలోకి రావడం కచ్చితం. ఆ వచ్చిన తరువాత పాలనలో మీకే ప్రయారిటీ అని ఊరిస్తున్నారు. తాజాగా తాడేపల్లిలో జరిగిన పార్టీ నాయకుల మీటింగులో ఆయన మరోసారి ఇదే విషయం చెప్పారు. జగన్ లోని 2.0ని చూస్తారు అని కూడా అన్నారు. ఇటీవల కాలంలో ఆయన 2.0 అని పదే పదే అంటున్నారు. మరి ఆ 2.0 ఎలా ఉంటుంది అన్నది క్యాడర్ కి కూడా ఆసక్తిగానే ఉంది. జగన్ అయితే కరోనా వల్ల తన పాలనలో ఇబ్బందులు వచ్చాయని ఆ సమయంలో తాను పార్టీ వారిని కలుసుకోలేకపోయాను అని చెప్పారు. వైసీపీ తొలిసారి గెలిచిన తరువాత క్యాడర్ కి అనుకున్నంతగా అవకాశాలు ఇవ్వలేకపోయాను అన్నది ఆయన పరోక్షంగా అంగీకరించారు.
ఇక మళ్ళీ 2029లో చాన్స్ వస్తుందని అపుడు క్యాడర్ కే బ్రహ్మరథం పడతామని చెబుతున్నారు. నిజంగా క్యాడర్ ని పట్టించుకుంటే వైసీపీకి సగం విజయం దక్కినట్లే అని అంటున్నారు. వైసీపీ అదృష్టం ఏమిటి అంటే అధినాయకత్వం తమను పెద్దగా గుర్తించకపోయినా పార్టీ పట్ల అదే అభిమానం చూపించడం. వైఎస్సార్ నుంచి జగన్ దాకా అదే ప్రేమను పంచడం. ఆ విధంగా చూస్తే జగన్ చాలా అదృష్టవంతులు అని చెప్పాలి. ఈ రోజుకీ క్యాడర్ వైసీపీని భుజాన వేసుకుంటోంది. నా బొందో అని కష్టపడుతోంది.
దానికి నిదర్శనం ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఇతర స్థానిక ఎన్నికల్లో మొత్తం 50 స్థానాలకు గానూ 39 వైసీపీ గెలవడం. అలా పార్టీని రక్త మోడ్చి గెలిపించిన క్యాడర్ కి కాసింత అండగా ఉంటే చాలు వైసీపీ బండి మళ్ళీ పట్టాలెక్కే సినట్లే అంటున్నారు. సో జగన్ చెబుతున్న 2.0లో ఏమి ఉన్నాయో తెలియదు కానీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీకి ప్రాణ సమానం అయిన క్యాడర్ ని దగ్గరకు తీసుకుంటే మాత్రం అద్భుతాలే జరుగుతాయన్నది సత్యం. దానికి కళ్ళ ఎదుట కనిపించే ఉదాహరణ టీడీపీ అని వేరేగా చెప్పాల్సిన పని అయితే లేదు.