Hot Posts

6/recent/ticker-posts

ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి బాధితుల‌కు ఏపీ ప్ర‌భుత్వం 10 ల‌క్ష‌లు ఎక్స్‌గ్రేషియా


HYDERABAD, VISAKHAPATNAM: కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి.. కొన్ని రోజులు వెకేష‌న్ ఎంజాయ్ చేసి వ‌ద్దామ‌ని భావించి.. క‌శ్మీర్ టూర్‌కు వెళ్లిన వారిని మృత్యువు ముష్క‌రుల రూపంలో ప‌ల‌క‌రించింది. ఎంజాయ్ చేసి తిరిగి వ‌ద్దామ‌ని వెళ్లిన వారు.. అటు నుంచి అటే అనంత‌లోకాల‌కు ప‌య‌నం అయ్యారు. ఈ దాడిలో సుమారు 28 మంది చ‌నిపోయారు. 

ఉగ్ర‌దాడిలో మృతి చెందిన వారిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన వారు కూడా ఇద్ద‌రు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిలో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు అండ‌గా నిలిచారు. బాధిత కుటుంబాల‌కు 10 లక్ష‌ల రూపాయ‌లు ఎక్స్ గ్రేషియా ఇవ్వ‌నున్నుట్లు ప్ర‌క‌టించారు.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జె.డి. చంద్రమౌళి, కావలికి చెందిన ఐటి నిపుణుడు మధుసూదన్ అనే ఇద్ద‌రు వ్యక్తులు ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ క్ర‌మంలో చంద్ర‌బాబు నాయుడు వారి కుటుంబాలు ఒక్కొక్క‌రికి రూ. 10 లక్షల ఎక్స్-గ్రేషియాను ప్రకటించారు. చంద్ర‌మౌళి మృత‌దేహం బుధ‌వారం రాత్రి ఎనిమిది గంట‌ల‌కు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. 

ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విమానాశ్ర‌యానికి చేరుకుని చంద్ర‌మౌళి భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించారు. అనంత‌రం చంద్ర‌మౌళి భార్య‌, కుటుంబ స‌భ్యుల‌తో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. ఈ సంద‌ర్భంగానే బాధిత కుటుంబాల‌కు ప్ర‌భుత్వం నుంచి 10 ల‌క్ష‌ల రూపాయ‌ల ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు.

అనంత‌రం చంద్ర‌బాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. "ఇది వ్యక్తులపై జ‌రిగిన దాడి మాత్రమే కాదు, భారతదేశ సమగ్రత,శాంతిపై జ‌రిగిన‌ దాడి" అని అన్నారు. దేశ భద్రతను పరిరక్షించడంలో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు ప్రతి పౌరుడు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 

దేశం శాంతి భ‌ద్ర‌త‌ల‌ను అస్థిరపరచడానికి ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించడం ద్వారా నిఘా అధికారులుగా వ్యవహరించాలని ఆయన కోరారు.

ఈ విషాద సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తుందని, వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడిలో రాష్ట్రానికి చెందిన ఇద్ద‌రు చ‌నిపోగా.. మ‌రో ఐదుగురు ప్రాణాల‌తో త‌ప్పించుకోగ‌లిగారు. 

వైజాగ్‌కు చెందిన ఈ ఐదుగురు టూరిస్టులు.. ఉగ్ర‌దాడి జ‌రుగుతున్న స‌మ‌యంలో ప‌క్క‌నే ఉన్న టాయిలెట్ కాంప్లెక్స్ ద‌గ్గ‌ర ఉన్నారు. అక్క‌డ నుంచి సంఘ‌ట‌నా స్థ‌లానికి కేవ‌లం 15మీట‌ర్ల దూరం మాత్ర‌మే ఉంది. ఇక కాల్పుల శ‌బ్దం విన‌ప‌డ‌గానే వారంతా అప్ర‌మ‌త్త‌మై.. అక్క‌డి నుంచి త‌ప్పించుకుని.. పొద‌ల వెన‌క దాక్కున్నారు. అలా ప్రాణాలు కాపాడుకున్నారు.