Hot Posts

6/recent/ticker-posts

ఆర్పీఎఫ్ ఎస్ఐ డ్రెస్ లో పెళ్లి చూపులకు వెళ్లి అడ్డంగా బుక్కైంది


 కోరుకున్నది దక్కకుంటే కసిగా ప్రయత్నించాలే తప్పించి అందుకోసం షార్ట్ కట్ దారిని వెతికితే అడ్డంగా బుక్ కావటం ఖాయం. నిజాన్ని దాచేసి అబద్ధాలతో చెలామణీ అయ్యే తీరు ఒకరోజుకు కాకుంటే ఏదో రోజున బద్ధలవుతుంది. తాజా ఉదంతం ఆ కోవకు చెందిందే. రైల్వే పోలీసు కావాలన్నది ఆమె ఆకాంక్ష. అందుకోసం 2018లో జరిగిన ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్షకు హాజరైంది. కంటి చూపు సరిగా లేకపోవటంతో ఆమె రిజెక్టు అయ్యింది. అయితే.. ఇంట్లో వారి ముందు.. గ్రామస్తుల ఎదుట గొప్పల కోసం తాను ఆర్పీఎఫ్ ఎస్ఐ అన్నట్లుగా బిల్డప్ ఇచ్చేది. 


దాదాపు ఏడాది పాటు గ్రామస్తులను నమ్మించిన ఆమె.. చివరకు పెళ్లి చూపులకు యూనిఫాంలో వెళ్లింది. ఆమె తీరు తేడా కొట్టటంతో పెళ్లి కొడుకు వాళ్లు ఆరా తీశారు. కట్ చేస్తే.. ఆమె మోసం బయటపడింది. ఆమెను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఇంత నాటకాన్ని నడిపించారు నార్కట్ పల్లికి చెందిన మాళవిక. హైదరాబాద్ లోని నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఆర్పీఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ కు హాజరైంది. కంటిచూపు సరిగా లేకపోవటంతో ఆమె అర్హత సాధించలేకపోయింది. 

అయితే.. ఎస్ఐగా చెలామణీ కావాలని భావించిన ఆమె.. ఎల్బీ నగర్ ప్రాంతంలో ఆర్పీఎఫ్ ఎస్ఐ యూనిఫారం అమ్మే చోట దాన్ని కొనుగోలు చేసింది. రైల్వే ఎస్ఐగా నటిస్తూ.. దాదాపు ఏడాది పాటు అందరిని నమ్మించింది. మోసాలకు పాల్పడింది. ప్రముఖులను కలిసి వారితో ఫోటోలు దిగేది. ఇన్ స్టాలో పోస్టు చేసేది. గుళ్లకు వెళ్లి అక్కడి మర్యాదలు పొందేది. మొత్తంగా ఆమె పాపం పండింది. పెళ్లి చూపులకు పోలీసు యూనిఫాంలో వెళ్లిన ఆమె తీరుపై సందేహం వచ్చిన పెళ్లి కొడుకు వారు.. వారికి తెలిసిన వారు ఆర్పీఎఫ్ లో పని చేస్తుండంలో ఆమె గురించి ఆరా తీశారు. 

దీంతో ఆమె పాపం పండింది. మోసం బయటకు వచ్చింది. ఈ సమాచారం తెలుసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు రంగంతోకి దిగి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. విచారణలో మరిన్ని అంశాలు వెలుగు చూసే వీలుందని భావిస్తున్నారు.