ఏలూరు: ట్రాఫిక్ నిబంధనలపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండి రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా సురక్షిత ప్రయాణాలు చేయాలనీ ఉప రవాణా కమిషనర్ ఎస్. శాంతి కుమారి తెలిపారు. గురువారం స్ధానిక సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ నుండి రోడ్డు ప్రమాదాల నివారణ వారోత్సవాల్లో బాగంగా హెల్మెట్ ర్యాలీని ఉప రవాణా కమీషనరు ఎస్. శాంతకుమారి, జిల్లా అధనపు ఎస్పీ జి. స్వరూపరాణి కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఉప రవాణా కమీషనరు శాంతకుమారి మాట్లాడుతూ. పోలీసు, రవాణా శాఖ సమన్వయంతో వాహనదారుల భధ్రత, ప్రయాణికుల సంక్షేమమే ధ్యేయంగా రోడ్డు భధ్రత వారోత్స వాలను జనవరి 20వ తేదీ నుండి ఫిబ్రవరి 19వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఇందులో బాగంగా ఈరోజు హెల్మెట్ ధరించి ప్రయాణించడం ప్రయాణదారులకు రక్షణకు రక్షణ పై అవగాహన కలిగించడానికి హెల్మెట్ ర్యాలీని నిర్వహిస్తున్నామని అన్నారు.
2030 నాటికి దేశంలో 50 శాతం రోడ్డు ప్రమాదాలను తగ్గించే విధంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గణంకాల సూచనల మేరకు దేశంలో 2021 లో సుమారు నాలుగు లక్షల 12 వేలు రోడ్డు ప్రమాదాలు జరిగాయని వీటిలో లక్షా 52 వేల మంది ప్రాణాలు కోల్పోయారని, 3 లక్షల 84 వేల మంది గాయాలు పాలయ్యారని చెప్పారు.
గత సంవత్సరంలో ఏలూరు జిల్లాలో 636 రోడ్డు ప్రమాదాలకు 224 మంది ప్రాణాలు కోల్పోయారని, 617 మంది గాయాలు పాలయ్యారని తెలిపారు. ప్రమాదాలకు ముఖ్యకారణం మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయని చెప్పారు. వీటిలో అతివేగం, హెల్మెట్ ధరించకపోవడం, మద్యం సేవించడం , కారులో సీట్ బెల్ట్ ఉపయోగించుకోకపోవడం డ్రైవర్ యొక్క ఏకాగ్రత భంగం చేయడం, కారుల్లో పాటలు, సెల్ ఫోన్లు ఉపయోగించడం , ఓవర్ టేక్ చేయడం, తదితర కారణాలుచేత రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. దీనిని నివారించడానికి నాణ్యతమైన హెల్మెట్ ను ధరించడం కారులో సీట్ బెల్ట్ ను ఉపయోగించుకోవడం, ప్రయాణంలో సెల్ ఫోన్లో మాట్లాడకుండా ఉండటం, రాత్రివేళ హెడ్ లైట్స్ ను డ్రైవింగ్ కు అవసరంగా ఉపయోగించడం వంటి చర్యల ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
జిల్లా అధనపు ఎస్పీ జి. స్వరూపరాణి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఒకటిన్నరమాసంలో 74 రోడ్డు ప్రమాదాలు జరిగాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ అతివేగంగా వాహనాన్ని నడపకుండా ప్రశాంతంగా ప్రయాణించాలని అలాగే నాణ్యత గల హెల్మెట్ ను ధరించి , ట్రాఫిక్ రూల్స్ ను పాటిస్తూ వాహన ప్రమాదాలకు గురికాకుండా ఉండాలని ప్రయాణించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏలూరు డిఎస్పీ శ్రీనివాసరావు, పోలీసు అధికారులు, రవాణా శాఖ అధికారులు, మోటారు వెహికల్స్ షొరూం సిబ్బంది తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.