ఏలూరు జిల్లా, టీ నర్సాపురం: మండలంలోని అల్లంచర్ల గ్రామంలో విత్తన పరిశోధన కేంద్రానికి సంబంధించిన భూమిని కొందరు భూస్వాములు అక్రమంగా ఆక్రమించు కోవటం పట్ల గ్రామ సర్పంచ్ నార్ని వెంకటరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి..
గత 20 సంవత్సరాల క్రితం మండలంలోని అల్లంచర్ల గ్రామంలోని సర్వే నెంబర్ 70 లో విత్తన పరిశోధన కేంద్రాన్ని గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, అప్పటి నుండి మండలంలోని వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో ఈ భూములు ఉన్నాయన్నారు. అయితే కొందరు భూస్వాములు ఈ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని గ్రామ సర్పంచ్ నార్ని వెంకటరావు ఆవేదన వ్యక్తం చేశారు. విత్తన పరిశోధన కేంద్రానికి ఏర్పాటు చేసిన దాదాపు 40 ఎకరాలలో 20 ఎకరాలకు పైగా ఆక్రమించుకున్నారని తెలిపారు.
వ్యవసాయ అధికారులు ఈ విషయంపై జిల్లా అధికారులకు స్దానిక రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయకపోవడం పట్ల ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా ఈ విషయంపై ఎటువంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నానన్నారు. అదికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆక్రమించుకున్న భూములలో కొందరు పామాయిల్ తోటలు వేశారని, మరికొందరు మొక్కజొన్న వంటి పంటలు పండిస్తున్నారని సర్పంచ్ తెలిపారు.
కాగా పలుసార్లు జిల్లా కలెక్టర్కు ఆర్డిఓకు రెవెన్యూ వారికి అగ్రికల్చర్ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసానని, ప్రత్యక్షంగా తెలిపానని, అవి కాగితాలకే పరిమితం అయ్యిందని, దాని వలన ఎటువంటి ఉపయోగం లేదన్నారు. దీనినిబట్టి చూస్తే ఉన్నత అధికారులు అమ్ముడుపోయారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం అగ్రికల్చర్ ఆఫీసర్ ను అడిగితే ఎమ్మార్వో కి తెలియజేయమని చేతులుదులుపుకున్నారని చెప్పారు. స్దానిక అధికారులు అధికార ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారని విమర్శించారు.
ఈ విషయంపై రెవెన్యూ కార్యాలయాలనికి ఎన్ని సార్లు తిరిగినా అక్కడ ఆఫిస్ లో సరిగా అధికారులు ఉండరని, అక్కడ అడిగితే అధికారులు క్యాంపులో ఉన్నారని చెప్తారనే సమాధానం తప్పా.. ప్రజలకు అందుబాటులో ఉండరని ఆరోపించారు. ఒక్క అధికారి కూడా స్థానికంగా ఉండరని, రాకపోయినా.. వచ్చి క్యాంపులో ఉన్నారని అబద్ధం చెబుతారని, అధికారుల పనితీరుపై ప్రజలు విసుగెత్తి ఉన్నారని ఆరోపించారు.
గత స్దానిక తహసిల్దారును కాపుకాసుకుని పలుసార్లు కలిసినా ఎటువంటి స్పందన లేదని ఆయన ఆరోపించారు. దీనికి కారణం అధికార పార్టీలోని కొందరు నాయకులు ఇచ్చే కాసులకు అమ్మడు పోవడం, వారి ఒత్తిడి వల్ల అధికారులు స్పందించడం లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి విత్తిన పరిశోధన కేంద్రం సంబంధించిన భూమిని కోల్చి తిరిగి అప్ప చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.