పనితీరు బాగుంటేనే ఎమ్మెల్యేలకు టికెట్
జూలై 1 నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం
రాష్ట్రంలోని 87శాతం ఇళ్లకి మన ప్రభుత్వంలో మంచి చేశాం
అమరావతి: 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోని 175కు 175 సీట్లు వైఎస్సార్ సీపీ ఖచ్చితంగా గెలవాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. గడప గడపకు కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. సీఎం క్యాంపు ఆఫీసులో జగనన్న సురక్ష, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్ సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కొన్ని కోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారని, వారందరికీ న్యాయం చేయాలంటే మరోసారి మనం అధికారంలోకి రావాలన్నారు. పనితీరు బాగోని ఎమ్మెల్యేని కొనసాగిస్తే వారి వల్ల వారికే నష్టమని, పార్టీకీ కూడా నష్టమని పేర్కొన్నారు. సర్వే చేసినప్పుడు అందరి గ్రాప్‌లు బలంగా ఉండాలని సీఎం సూచించారు. దీనికి గడప - గడపకు కార్యక్రమం బాగా ఉపయోగ పడుతుందన్నారు. దీని వల్ల ఎమ్మెల్యేల గ్రాప్ పెరుగుతుందని పార్టీకీ మేలు జరుగుతుందని చెప్పారు.
గడప గడప ద్వారా ప్రజల్లో ఉండటమే కీలకం
ప్రతి ఒక్కరూ 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకొని ప్రజల వద్దకు వెళ్లాలని సీఎం జగన్ సూచించారు. పనితీరు బాగోలేక టికెట్లు రాకుంటే తనను బాధ్యుడినీ చేయొద్దని సూచించారు. ప్రజల్లో మంచి అదరణ లేకుంటే వారి సీట్లు మార్చటం ఖాయమని హెచ్చరించారు. జులై 1 నుంచి జగనన్న సురక్ష కార్యక్రమం మొదలవుతుందని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు సంపూర్ణంగా మంచి జరిగేలా చూడాలన్నారు. సోషల్ మీడియా కూడా మనకు చాలా ముఖ్యమని సీఎం జగన్ చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. అబద్ధాలు, విష ప్రచారాలు పూర్తిస్థాయిలో తిప్పి కొట్టాలని, నెగిటివ్ మీడియా ద్వారా మారీచుల్లా మనపై యుద్ధం చేస్తున్నారని.. ఎల్లో మీడియా చేసే దుష్ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా తిప్పి కొట్టాలని సూచించారు.
రాష్ట్రంలోని 87 శాతం ఇళ్లకి మన ప్రభుత్వంలో మంచి చేశాం: సీఎం
రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో 92% ఇళ్లకి మంచి జరిగిందని, పట్టణ స్థాయిలో 82% ఇళ్లకు మంచి జరిగిందని, ఇలా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా సగటుగా 87శాతం ఇళ్లకి మన ప్రభుత్వంలో మంచి జరిగిందని సీఎం జగన్ తెలిపారు. ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి తిరిగి దీని పై ప్రజలని చైతన్యపరచాలని సీఎం సూచించారు. లేదంటే నెగిటవ్ వార్తలతో కొన్ని మీడియా గ్రూపులు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.