ఏలూరు జిల్లా, చింతలపూడి: జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రజలకు వివరించి, అర్హులైన ప్రజలకి లబ్ధి చేకూర్చాలని చింతలపూడి నగరపంచాయతీ కమిషనర్ ఎన్.రాంబాబు అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమాలపై సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు, గృహ సారదులకి అవగాహన కల్పించే కార్యక్రమం గురువారం చింతలపూడి అర్ బి కే లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ రాంబాబు మాట్లాడుతూ శుక్రవారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మనమందరం బాధ్యతగా తీసుకొని ప్రజలకు చేరువ చేయాలన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశాన్ని వివరిస్తూ రాష్ట్ర మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రకరకాల పథకాలు ఇస్తున్నప్పటికీ పథకాలకి అవసరమైన అటువంటి రకరకాల సర్టిఫికెట్స్ ప్రజల దగ్గర ఉండకపోవడం వలన కొంతమంది పథకాలకు అర్హులై ఉండి కూడా లబ్ది పొందలేక పోతున్నారని, ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి అత్యంత ముఖ్యమైన సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం కోసం ఈ జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించడం జరిగిందన్నారు.
ప్రధానంగా 11 రకాల సేవలు, ధ్రువీకరణ పత్రాల జారీకి ఎలాంటి సర్విసు చార్జీలు వసూలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జూలై 1 నుంచి సచివాలయాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నామని, వలంటీర్లతో పాటు సచివాలయాల సిబ్బంది ఈ నెల 24 నుంచే ఇంటింటికీ వెళ్లి ఈ కార్యక్రమం గురించి వివరించాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల జారీకి వినతులను సేకరించాలన్నారు. క్యాంపుల నిర్వహణ సమయంలో వినతుల స్వీకరణ, పరిష్కారం కోసం రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, సర్విసు రిక్వెస్టు డెస్క్లు వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు. ఏ రోజు ఏ సచివాలయం పరిధిలో క్యాంపు నిర్వహిస్తున్నారో ముందస్తుగా ఆయా ప్రాంత ప్రజలందరికీ తెలిసేలా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
ప్రధానంగా కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భూకొనుగోలు అనంతరం ఆన్లైన్లో నమోదు, ఆన్లైన్లో భూవివరాల నమోదులో మార్పులు చేర్పులు, తదితర ఆధార్కార్డులో మొబైల్ నంబర్ అప్డేట్, కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్సీ), కొత్తరేషన్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ విభజన వంటి సేవలు సర్వీసు చార్జీలు లేకుండా అందించనున్నమని, రాష్ట్ర ప్రభుత్వం కల్పుస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కమిషనర్ రాంబాబు తెలిపారు. ఈ కార్యకమంలో నగర పంచాయితీ పరిధిలో గల సచివాలయం వాలంటీర్ లు,గృహ సారథులు తదితరులు పాల్గొన్నారు.