తాజా వార్తలు

10/recent/ticker-posts

గండిగూడెంలో మధ్యాహ్న భోజన పథకంపై విజిలెన్స్ తనిఖీలు.. రికార్డుల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి


ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, టి. నరసాపురం మండలం, గండిగూడెం, ఆగస్టు 11: గండిగూడెం గ్రామంలో మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడి కార్యకలాపాల నిర్వహణపై విజిలెన్స్ కమిటీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. విజిలెన్స్ కమిటీ సభ్యుడు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ ప్రాథమిక పాఠశాలతో పాటు అంగన్వాడి కేంద్రాన్ని పరిశీలించారు. ముందుగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. బియ్యం, గుడ్లు, చిక్కీలు తదితర నిత్యావసర సరుకుల నిల్వ, వినియోగానికి సంబంధించిన వివరాలు సక్రమంగా నమోదు చేయకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.


పాఠశాలలో రికార్డుల నిర్వహణపై సిబ్బందిని ప్రశ్నించగా, వాటిని ప్రధానోపాధ్యాయుడే పర్యవేక్షిస్తారని, ప్రస్తుతం ఆయన సెలవులో ఉన్నారని తెలిపారు. అయితే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రికార్డులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని విజయకృష్ణ సూచించారు. సరుకుల నిల్వ, విద్యార్థులకు అందించిన ఆహారం, వినియోగించిన పరిమాణం వంటి వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని అన్నారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించిన విజిలెన్స్ కమిటీకి అక్కడ హెల్పర్, కొంతమంది చిన్నారులు మాత్రమే కనిపించారు. పలు నెలలుగా రికార్డులు సక్రమంగా నిర్వహించలేదని, బాలింతలు, ఇతర లబ్ధిదారులకు సంబంధించిన వివరాలు కూడా నమోదు కాలేదని తనిఖీలో గుర్తించారు. చిన్నారుల హాజరు వివరాలు కూడా పూర్తిస్థాయిలో నమోదు చేయకపోవడంపై విజయకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. రికార్డులు రాయవద్దని తమకు చెప్పారని, అంగన్వాడి వర్కర్ అప్పుడప్పుడు వచ్చి ఫోన్‌లో వివరాలు నమోదు చేసుకుంటారని హెల్పర్ చెప్పినట్లు సమాచారం.

స్థానికుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈ ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు డాక్టర్ వంటిపల్లి విజయకృష్ణ తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సక్రమంగా అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు. పాఠశాల విద్యార్థులు, అంగన్వాడి చిన్నారులు, బాలింతలు, ఇతర లబ్ధిదారులకు అందాల్సిన ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందేలా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆయన కోరారు.