తాజా వార్తలు

10/recent/ticker-posts

జరిమానా కాదు… హెల్మెట్‌తో ప్రాణ రక్షణ – నూజివీడు రూరల్ ఎస్ఐ లక్ష్మణ్ బాబు వినూత్న చర్య


నూజివీడు, పశ్చిమ వాహిని, మార్చి, 22: మండలం తుక్కులూరు సెంటర్‌లో రహదారి భద్రతపై పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, రూరల్ సీఐ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ లక్ష్మణ్ బాబు తన సిబ్బందితో కలిసి విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహన తనిఖీలు చేపట్టి ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.


సాధారణంగా హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారికి జరిమానాలు విధించడం జరుగుతుంది. అయితే ఎస్ఐ లక్ష్మణ్ బాబు మాత్రం కేవలం జరిమానాతో సరిపెట్టకుండా వినూత్నంగా వ్యవహరించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ “హెల్మెట్ భారం కాదు… అది ప్రాణ రక్షణ” అని పేర్కొన్నారు. ప్రమాదాల సమయంలో తలకు తగిలే గాయాల నుంచి హెల్మెట్ రక్షణ కల్పిస్తుందని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాంతకంగా మారవచ్చని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.

అదేవిధంగా, వాహనదారులు తమ కుటుంబ బాధ్యతను గుర్తుంచుకోవాలని, తమ క్షేమం కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తుంటారని తెలిపారు. యువతలో ప్రమాదాల శాతం ఎక్కువగా ఉండటంతో, వేగాన్ని తగ్గించి భద్రతా నియమాలను పాటించాలని హితవు పలికారు.

పోలీసుల ఈ వినూత్న చర్యపై స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శిక్షించడమే లక్ష్యంగా కాకుండా ప్రాణాల రక్షణ కోసం ముందడుగు వేసిన పోలీసుల విధానాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.