నూజివీడు, పశ్చిమ వాహిని, మార్చి, 22: డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, నూజివీడు రూరల్ సీఐ కె. రామకృష్ణ ఆధ్వర్యంలో ఆగిరిపల్లి ఎస్ఐ శుభ శేఖర్ తన సిబ్బందితో కలిసి ఆగిరిపల్లి పరిధిలో విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారిపై విస్తృతంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా వాహనదారుల్లో భద్రతా అవగాహన పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్ఐ శుభ శేఖర్ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణ రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. రహదారి భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, అతివేగంతో వాహనాలు నడపరాదని హెచ్చరించారు. “వేగం వద్దు – ప్రాణం ముద్దు” అనే నినాదాన్ని గుర్తుంచుకోవాలని, ప్రమాదం జరిగిన తర్వాత బాధపడే కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం మేలని అన్నారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల జరిగే ప్రమాదాలను కూడా వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. యువత ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు.
ఈ విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడమే కాకుండా, నేరాల నివారణకు కూడా దోహదం చేస్తుందని ఎస్ఐ తెలిపారు. ప్రతి వాహనదారుడు తన కుటుంబం కోసం సురక్షితంగా ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.








