తాజా వార్తలు

10/recent/ticker-posts

మాదకద్రవ్య రహిత ఏలూరు జిల్లాగా తీర్చిదిద్దుదాం – కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధం : కలెక్టర్ కె. వెట్రిసెల్వి


ఏలూరు, పశ్చిమ వాహిని, ఏప్రిల్ 22: మాదకద్రవ్య రహిత జిల్లాగా ఏలూరును సమిష్టి కృషితో తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను, ప్రజలను పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తప్పవని, వాటితో పట్టుబడిన వారికి శాశ్వత క్రిమినల్ రికార్డుతో పాటు ఉద్యోగాలు, పాస్‌పోర్టులు వంటి అవకాశాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆమె హెచ్చరించారు.


జిల్లా కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తుందని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల రవాణా, వినియోగం, విక్రయాలపై కఠినంగా కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల నియంత్రణకు సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలని ఆమె పిలుపునిచ్చారు.

పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని, విద్యార్థుల్లో చైతన్యం కలిగించాలని సూచించారు. అలాగే గంజాయి, డ్రగ్స్ సరఫరా సమాచారం అందించేందుకు ప్రజలు నేషనల్ డెడికేషన్ హెల్ప్‌లైన్ 14446 మరియు ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972ను వినియోగించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని వెల్లడించారు.

డ్రగ్స్‌కు బానిసైన వారికి డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. ట్రైన్లు, రవాణా వాహనాల ద్వారా జరిగే అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా “ఆపరేషన్ విజయం” ద్వారా గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు వివరించారు.

జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తన, స్నేహాలు, రోజువారీ అలవాట్లపై గమనిస్తూ ఉండాలని సూచించారు. చిన్న వయసులోనే చెడు స్నేహాల వల్ల మత్తు పదార్థాల వైపు వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రారంభ దశలోనే జాగ్రత్తలు తీసుకుంటే సమస్యను నివారించవచ్చని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్. సుస్మిత, ఉప రవాణా కమిషనర్ షేక్ కరీం, ఆర్&బీ ఎస్‌ఈ కె. విజయరత్నం, డీసీహెచ్ డా. బి. పాల్ సతీష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఏ. భాను ప్రతాప్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ, ఐసిడిఎస్ పీడీ పి. శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి డా. సి.హెచ్. సూర్యచక్రవేణి, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి ఎస్.బి. శేఖర్, పంచాయతీరాజ్ ఎస్‌ఈ జెడ్. రమేష్, ఈగల్ టీమ్ ఇంచార్జ్ బి. ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.