ఏలూరు/నూజివీడు, పశ్చిమావహిని, మార్చి 21: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని నూజివీడు పట్టణంలోని ఈద్గాలో రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి స్నేహపూర్వకంగా పలకరించారు. ఈ సందర్భంగా పేద ముస్లిం సోదర, సోదరీమణులకు దానధర్మ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు. అభివృద్ధే అజెండాగా, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
రంజాన్ పండుగకు ముందుగానే స్వంత నగదుతో సుమారు రూ.15 లక్షలు ఖర్చు చేసి, నూజివీడు నియోజకవర్గంలోని సుమారు 1500 మంది ముస్లిం సోదరులకు నూతన వస్త్రాలను అందజేసి పండుగ సంతోషాన్ని పంచుకున్నామని తెలిపారు. రంజాన్ మాసం శాంతి, సహనం, పరమత సహనం, క్రమశిక్షణకు ప్రతీక అని పేర్కొంటూ ఉపవాసం ద్వారా ఆత్మశుద్ధి, పేదల పట్ల దయాభావం పెరుగుతుందని చెప్పారు. ఖురాన్ అవతరించిన ఈ పవిత్ర మాసంలో ప్రతి ముస్లిం తన సంపాదనలో 2.5 శాతం జకాత్ రూపంలో పేదలకు పంచడం ద్వారా సమానత్వం నెలకొంటుందని వివరించారు.
ముస్లిం సోదరుల సంక్షేమం కోసం హజ్ యాత్రకు రూ.100 కోట్లు కేటాయించినట్లు, ఈద్గాను వచ్చే బక్రీద్ నాటికి పూర్తి చేస్తామని, అలాగే షాధీఖానా నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. కడప, విజయవాడ దర్గాలను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్ర వక్ఫ్ బోర్డు కమిటీ సమర్థంగా పనిచేస్తోందని కొనియాడారు.
అలాగే మాజీ రాష్ట్రపతి ఎ. పి. జె. అబ్దుల్ కలాం ను రాష్ట్రపతిగా చేయడంలో నారా చంద్రబాబు నాయుడు పాత్ర విశేషమని గుర్తుచేశారు. ముస్లిం మైనార్టీలకు రాజకీయంగా కూడా ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ముస్లిం సోదర సోదరీమణులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



.jpeg)








