తాజా వార్తలు

10/recent/ticker-posts

భీమడోలులో స్పెషల్ డ్రైవ్ – “హెల్మెట్ ధరించండి… ప్రాణాలు కాపాడుకోండి” పోలీసుల హెచ్చరిక


ఏలూరు జిల్లా భీమడోలు, పశ్చిమ వాహిని, మార్చి 23:  మండలం పూళ్ళ గ్రామం సమీపంలోని NH-216A రహదారిపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాహనదారుల్లో రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్ఐ షేక్ మదీనా బాషా తమ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.


ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను ఆపి జరిమానాలు విధించకుండా, వారిచేతనే 75 హెల్మెట్లు కొనుగోలు చేయించడం ప్రత్యేకంగా నిలిచింది. భవిష్యత్తులో హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనదారులకు కూడా అవగాహన కల్పించారు. ముఖ్యంగా యువతకు పోలీసులు ప్రత్యేక సూచనలు చేస్తూ, రహదారి ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులేనని ఆందోళన వ్యక్తం చేశారు.

అతివేగం, నిర్లక్ష్యం, థ్రిల్ కోసం బైక్‌లను వేగంగా నడపడం వంటి కారణాల వల్ల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని హెచ్చరించారు. ప్రమాదం సమయంలో తలకు తగిలే చిన్న గాయం కూడా ప్రాణాంతకమవుతుందని, హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, వేగ పరిమితులను పాటించాలని, ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, ఉల్లంఘించిన తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించి పోలీసులకు సహకరించాలని ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్ఐ మదీనా బాషా విజ్ఞప్తి చేశారు.