ఏలూరు, డిసెంబరు 15 : జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం డిసెంబరు 15వ తేదీన పొట్టి శ్రీరాములు వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అధికారికంగా ఆత్మార్పణ దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్రుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన స్ఫూర్తిదాయక మహానీయుడని అన్నారు.
మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అని కలెక్టర్ పేర్కొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షను అనుభవించారని, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న గొప్ప యోధుడని తెలిపారు.
ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగానికి పూనుకుని అమరజీవిగా నిలిచిన పొట్టి శ్రీరాములు త్యాగం మనందరికీ మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వర రావు, ఆర్డీవో ఎం. అచ్యుత అంబరీష్, కెఆర్‌ఆర్‌సి డిప్యూటీ కలెక్టర్ ఎల్. దేవకీ దేవి, జిల్లా వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

