ఏలూరు, ప్రతినిధి, ముదినేపల్లి: హైదరాబాద్‌కు చెందిన రితిక ఫౌండేషన్ ప్రతి ఏటా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్థాయిలో సమాజ సేవలో విశేష కృషి చేసిన వ్యక్తులకు అందించే ప్రతిష్ఠాత్మక నంది అవార్డు – 2025కు ముదినేపల్లి గ్రామానికి చెందిన వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి ఎంపిక కావడం స్థానికంగా హర్షాతిరేకాలకు దారి తీసింది.
విద్యార్థి దశలోనే తోటి విద్యార్థులకు సహాయం చేయడం, అమరావతి రాజధాని నిర్మాణానికి తన వంతు ఆర్థిక సహకారం అందించడం, అలాగే పలు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో వైష్ణవి చూపిస్తున్న సేవాభావాన్ని గుర్తించిన రితిక ఫౌండేషన్ నిర్వాహకులు ఆమెను ఈ ఏడాది నంది అవార్డుకు ఎంపిక చేశారు.
సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో యువత భాగస్వామ్యం ఎంతో అవసరమన్న భావనతో వైష్ణవి చేపట్టిన సేవలు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ అవార్డును ఈ నెల 21వ తేదీన ద్వారకాతిరుమలలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆమెకు అందజేయనున్నట్లు తెలిపారు.
ఇదే కార్యక్రమంలో వైష్ణవి తండ్రి డాక్టర్ అంబుల మనోజ్ను కూడా ఆయన సామాజిక సేవలను గుర్తిస్తూ బెస్ట్ సోషల్ వర్క్ అవార్డు – 2025కు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు. తండ్రి–కూతురు ఇద్దరికీ ఒకే వేదికపై అవార్డులు దక్కడం ముదినేపల్లి గ్రామానికి గర్వకారణంగా మారింది.
వైష్ణవి ఎంపికపై గ్రామస్తులు, విద్యార్థులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేస్తూ, ఆమె మరింత ఉన్నత స్థాయిలో సేవలు కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నారు.
.jpeg)

