Hot Posts

6/recent/ticker-posts

కరెక్ట్ టైం చూసి జగన్ మీద కాంగ్రెస్ బాణం !


అయితే కాంగ్రెస్ పెద్దలు కూడా జగన్ మీదనే టార్గెట్ చేసి ఉంచారని ఇపుడిపుడే అర్ధం అవుతోంది.

ANDHRAPRADESH:ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అయితే టీడీపీ కూటమి కంటే ఎక్కువగా వైసీపీ మీద తన అన్న జగన్ మీద విమర్శలు చేస్తారు అన్నది ప్రచారంలో ఉంది. అదంతా షర్మిల సొంత అజెండా అని కూడా కాంగ్రెస్ లో నేతలు అంటున్నారని చెప్పుకుంటూంటారు. ఇక అన్నా చెల్లెళ్ళ మధ్య సమరంగా కాంగ్రెస్ పార్టీ వేదికను షర్మిల మార్చారని వైసీపీ నేతలు కూడా అంటూంటారు.

అయితే కాంగ్రెస్ పెద్దలు కూడా జగన్ మీదనే టార్గెట్ చేసి ఉంచారని ఇపుడిపుడే అర్ధం అవుతోంది. ఏపీలో కాంగ్రెస్ కి గత వైభవం రావాలంటే కూటమితో కాదని కేంద్ర కాంగ్రెస్ పెద్దలు విశ్లేషించుకుంటున్నరని అంటున్నారు. తన సొంత ఓటు బ్యాంక్ అంతా జగన్ వద్దనే ఉందని అందువల్ల ఆయన రాజకీయంగా ఎంత ఇబ్బంది పడితే అంతలా కాంగ్రెస్ కే మేలు జరుగుతుంది అన్నది ఏదో ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది అంటున్నారు.

ఇంతకాలం జగన్ మీద షర్మిల మాత్రమే విమర్శలు చేయడం అంతా చూశారు. కానీ ఇపుడు కాంగ్రెస్‌ పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ సీన్ లోకి వచ్చారు. ఆయన నేరుగా జగన్ మీదనే బాణాలు ఎక్కుపెట్టారు. ఏపీలో వేల కోట్ల లిక్కర్ స్కాం జగన్ సీఎం గా ఉండగా జరిగింది అని ఆయన ఆరోపించారు.

అంతే కాదు జగన్‌ లిక్కర్‌ మాఫియా కోటి కుటుంబాలను నాశనం చేసిందని కూటమి కంటే పదునైన విమర్శలనే మాణికం ఠాగూర్‌ చేశారు. ఈ కేసులో అంతా పావులు అని ఆయన అంటూ జగన్ మాత్రమే కీలక సూత్రధారి అని తేల్చేశారు. గత కొద్ది నెలలుగా సిట్ ఈ కేసు విషయంలో మల్లగుల్లాలు పడుతూంటే జగనే మూలం అని కాంగ్రెస్ పార్టీ కీలక నేత వ్యాఖ్యానించడం విశేషం.

ఈ కేసులో జగనే సర్వస్వం అని మాణికం ఠాగూర్‌ ఆరోపించడం చూస్తూంటే జగన్ విషయంలో కాంగ్రెస్ స్టాండ్ అలాగే ఉందని అర్ధం అవుతోంది. ఆయన ఇంకా కీలక కామెంట్స్ చేశారు. స్కాములు చేయడం జగన్ కి కొత్త కాదు అన్నరు. గతంలో చేసిన అవినీతి మీద కేసులు విచారణలో ఉన్నాయని అక్రమాస్తుల మీద సీబీఐ దర్యాప్తుని కూడా ముందుంచారు.

అంటే ఆనాడు కేంద్రంలో యూపీయే అధికారంలో ఉన్నపుడు జగన్ మీద పెట్టీ కేసులు కరెక్ట్ అని గుర్తు చేశారన్న మాట. జగన్ మీద కూటమి ఒక వైపు గురి పెట్టి ఉంచింది. ఇపుడు సీన్ లోకి కాంగ్రెస్ సైతం రావడంతో ఏపీలో వైసీపీ ఒంటరి పోరాటమే చేస్తోంది అని అంటున్నారు. వామపక్షాలు ఈ విషయంలో పెద్దగా వ్యాఖ్యానించడం లేదు కానీ మద్యం స్కాం జరిగింది అన్నది వారు సైతం అంగీకరిస్తారనే అంటున్నారు.

అలా చూస్తే ఏపీలోని కూటమి పార్టీలు మూడూ వైసీపీకి యాంటీ, విపక్షంలో ఉన్న ఇండియా కూటమి కూడా ఆ పార్టీకి యాంటీగా ఉంది. దాంతో ఏపీలో వైసీపీ అన్ని వైపులా టార్గెట్ అవుతోంది. ఒక విధంగా చెప్పాలంటే రాజకీయ పద్మ వ్య్హూహంలో ఉంది. ఇక వైసీపీ అధినేత జైలు పాలు అయితే ఏపీలో ఆ పార్టీ కకావికలం అవుతుందని అపుడు కాంగ్రెస్ లోకి వారంతా వస్తారు అన్న ఆలోచన ఏదైనా కాంగ్రెస్ పెద్దలకు ఉందేమో అని అంటున్నారు. 

అయితే రాజకీయాలలో అధినేతలు జైలుకు వెళ్తే సానుభూతి వస్తుందని గతంలో ఉదంతాలు నిరూపించాయి. అలా జరగదు అని ఇటీవల ఆప్ అధినేత కేజ్రీవాల్ అరెస్టు జైలు జీవితం కూడా నిరూపించింది. మరి జగన్ మీద బాణాలు వేస్తున్న కాంగ్రెస్ ఏపీలో ఏమి ఆశిస్తోంది అన్నది చూడాల్సి ఉంది.
Author

Shakir Babji Shaik

Editor | Amaravathi