సీఎం సిద్ధూ, డిప్యూటీ సీఎం డీకే హస్తిన పర్యటన
బెంగళూరులో ఎమ్మెల్యేలతో చర్చిస్తున్న పార్టీ ఇన్‌చార్జ్ సుర్జేవాలా
నాయకత్వ మార్పుపై పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ
కర్ణాటక సీఎం మార్పుపై మరోసారి ఊహాగానాలు
NATIONAL:కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి మార్పుపై జరుగుతున్న ప్రచారం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరూ ఒకేసారి హస్తినలో పర్యటిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు ఊపందుకున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పును కోరుతున్నారనే వార్తల నేపథ్యంలో, ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశం కానున్నారనే ప్రచారం ఈ ఊహాగానాలకు ఊతమిస్తోంది.
అయితే, ఈ పర్యటన పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి పనులకు సంబంధించిందేనని అటు సిద్ధరామయ్య, ఇటు డీకే శివకుమార్ స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్, తాను రాష్ట్ర నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల గురించి చర్చించేందుకు వచ్చానని తెలిపారు. మంత్రివర్గంలో ఎలాంటి మార్పులు ఉండబోవని ఆయన తేల్చిచెప్పారు. "సీఎం సిద్ధరామయ్య రక్షణ మంత్రితో సమావేశం కోసం వచ్చారు. మా పర్యటనలన్నీ అభివృద్ధి కోసమే" అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరానని, ఆయన పాట్నా పర్యటన నుంచి తిరిగి రాగానే కలుస్తానని డీకే వివరించారు.
మరోవైపు, పార్టీ కర్ణాటక ఇన్‌చార్జ్ రణ్‌దీప్ సుర్జేవాలా బెంగళూరులో ఎమ్మెల్యేలతో సమావేశమవుతున్నారు. దీనిపై డీకే స్పందిస్తూ, జిల్లా స్థాయిలో పార్టీని పునర్‌వ్యవస్థీకరించాలని అధిష్టానం కోరుతోందని, దానిపైనే సుర్జేవాలా కసరత్తు చేస్తున్నారని చెప్పారు. 2023లో కాంగ్రెస్ ఘన విజయం సాధించినప్పటి నుంచి సీఎం పదవిపై చర్చ కొనసాగుతూనే ఉంది. అప్పట్లో కుదిరిందని చెబుతున్న ఒప్పందం ప్రకారమే మార్పు జరగనుందనే వాదనలు వినిపిస్తున్నా, కాంగ్రెస్ దీనిపై అధికారికంగా స్పందించలేదు. నేతలు అభివృద్ధి పనులని చెబుతున్నప్పటికీ, ఒకేసారి ఇద్దరూ ఢిల్లీలో ఉండటం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Shakir Babji Shaik
Editor | Amaravathi