Hot Posts

6/recent/ticker-posts

వందేభారత్ రైలులో ప్రయాణికుడిపై దాడి కేసు.. బీజేపీ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు

వందే భారత్ రైల్లో ప్రయాణికుడిపై దాడి

బీజేపీ ఎమ్మెల్యే పారిఛా అనుచరులపనేనని ఆరోపణ

19న ఢిల్లీ-భోపాల్ రైల్లో ఘటన

ఎమ్మెల్యే చూస్తుండగానే ప్రయాణికుడిని చితకబాదిన వైనం

వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యేకు ఆదేశం

ఉత్తరప్రదేశ్‌‌లోని బబినా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ పారిఛా చిక్కుల్లో పడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక ప్రయాణికుడిపై దాడి జరిగింది. ఎమ్మెల్యే చూస్తుండగానే ఆయన అనుచరులు ప్రయాణికుడిపై దాడిచేసి చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా స్పందిస్తూ ఎమ్మెల్యేకు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

ఈ నెల 19న పారిఛా కుటుంబంతో కలిసి ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. సీటు మార్చుకునేందుకు ప్రయాణికుడు నిరాకరించడంతో ఎమ్మెల్యే అనుచరులు ప్రయాణికుడిపై దాడిచేశారు. రాజీవ్ సింగ్ సమక్షంలోనే జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎమ్మెల్యే అనుచరుల దాడిలో ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ముక్కు నుంచి రక్తం కారింది. ప్రయాణికుడిపై ఆయన అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేస్తున్నా.. ఎమ్మెల్యే చూస్తూ నిల్చున్నారు తప్పితే వారించకపోవడం గమనార్హం.

ఈ వీడియో బయటకు రావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ముకేశ్ నాయక్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంటూ పారిఛా తీరుపై మండిపడ్డారు. హై-స్పీడ్ రైల్లో ఎమ్మెల్యే ‘గూండాలు’ ప్రయాణికుడి ముక్కు, చెవులు, ఇతర భాగాల నుంచి రక్తం వచ్చేలా కొట్టారని ఆయన ఆరోపించారు.

మరోవైపు, ఎమ్మెల్యేనే తిరిగి ప్రయాణికుడిపై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ప్రయాణికుడు పదేపదే తన వ్యక్తిగత ప్రదేశంలోకి కాళ్లు చాపుతూ ఇబ్బంది కలిగించాడని, తాను అభ్యంతరం వ్యక్తం చేయగా దురుసుగా ప్రవర్తించాడని పారిఛా ఆరోపించారు. అంతేకాకుండా, ఆ ప్రయాణికుడు ఝాన్సీ స్టేషన్‌లో తన అనుచరులను పిలిపించి, తన మద్దతుదారులపై దాడి చేయించాడని కూడా ఎమ్మెల్యే ఆరోపించారు.

అయితే, వైరల్ అయిన వీడియో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఎమ్మెల్యే ఆ ప్రయాణికుడిని సీటు మార్చుకోమని అడిగారని, అందుకు అతను నిరాకరించడంతో ఈ గొడవ జరిగిందని తెలుస్తోంది. ఈ వివాదాన్ని తీవ్రంగా పరిగణించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా.. ఎమ్మెల్యే పారిఛాకు షోకాజ్ నోటీసు పంపారు. ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. "మీ చర్యలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయి, తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యాన్ని సూచిస్తున్నాయి. ఏడు రోజుల్లోగా స్పందించాలి, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం" అని నోటీసులో పేర్కొన్నారు.

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now