*నిరుద్యోగాన్ని రూపుమాపేందుకు కృషి
*మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
*సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వెల్లడి
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, కె. గంగవరం, బ్యూరో: రామచంద్రపురం నియోజవర్గంలో నిరుద్యోగాన్ని రూపుమాపడమే మంత్రి సుభాష్ ఉన్నత ఆశయమని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం అన్నారు. కె. గంగవరం మండలం పామర్రు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది.
రామచంద్రపురం నియోజవర్గంలోని పలు మండలాల నుంచి టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీటెక్ చదువుకున్న నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరయ్యారు. ఈ జాబ్ మేళాలో సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ (అమెరికా బేస్డ్ ఏజే జెమ్స్ రిజిస్టర్ కంపెనీ) హెచ్ఆర్ వై ఎస్ ఎస్ రావు ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహించారు. తొలుత జాబ్ మేళాకు హాజరైన వారిని ఉద్దేశించి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ మంత్రి సుభాష్ కోరిక మేరకు ఇప్పటికే పలు జాబ్ మేళాలు నిర్వహించి, నిరుద్యోగులకు, పేద విద్యార్థులకు తమ ఫౌండేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు.
సేవే పరమావధిగా తమ ఫౌండేషన్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఫార్మా, ఆక్వా రంగాలకు మంచి భవిష్యత్తు ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ రంగాలకు అత్యధిక ప్రాముఖ్యత ఇస్తుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు.
సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ హెచ్ఆర్ వై ఎస్ ఎస్ రావు మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో సుమారు 100 మంది హాజరయ్యారు అన్నారు. కాకినాడ సమీపంలోని మూలపేటలో ఇంటర్నేషనల్ నిబంధనలు ప్రకారం తమ కంపెనీ పనిచేస్తుందని తెలిపారు. మంత్రి సుభాష్ సూచనల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఈ జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థుల ఇంటర్వ్యూలు పూర్తయిన తర్వాత వారం రోజుల్లో నియామక పత్రాలు అందిస్తామన్నారు.
ఎంపికైన వారికి జీతంతో పాటు, భోజన, రవాణా సదుపాయం, ఈ ఎస్ ఐ, పిఎఫ్, సౌకర్యాలుంటాయన్నారు. నిరుద్యోగులైన యువతీ, యువకులు పట్ల మంత్రి సుభాష్ ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఉన్నారన్నారు. ఇంటర్వ్యూకు హాజరైన వారితో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ ఆర్ లు మంత్రి సుభాష్ , సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, సిబ్బంది, కూటమి నాయకులు, నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు.