Hot Posts

6/recent/ticker-posts

ఆ విషయంలో సీఎంగా జగన్ రికార్డు..!


 ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి టర్మ్ విజయవంతంగా ముగిసినట్లే. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కోడ్ అమల్లోకి వచ్చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఆయన తన పదవీ కాలాన్నిపూర్తి చేసుకున్నట్లుగా చెప్పాలి. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఒక విషయంలో మాత్రం ఆయన తిరుగులేని రికార్డును క్రియేట్ చేశారంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. 


ఒక్కటంటే ఒక్క ప్రశ్నను ఎదుర్కోకుండానే తన పదవీ కాలాన్ని పూర్తి చేయటం ఒక రికార్డుగా అభివర్ణిస్తున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రులుగా పదవీబాధ్యతలు చేపట్టే అధినాయకులు ఎవరైనా సరే.. ప్రభుత్వ విధానాలతో పాటు.. తమ పొలిటికల్ స్టాండ్ ను వివరించేందుకు.. ప్రజల్లో చేరేందుకు వీలుగా మీడియా భేటీల్ని నిర్వహిస్తూ ఉంటారు. 
 
అలాంటి తీరుకు జగన్మోహన్ రెడ్డి కాస్త భిన్నం. ఆయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టింది 2019లో అయినా.. ప్రభుత్వంలో కాస్త కుదురుకొని పాలన వైపు ఫోకస్ చేసే సమయానికి కొవిడ్ వచ్చి పడటం.. లాక్ డౌన్ లాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. కొవిడ్ టైంలో రెండు.. మూడు ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసినప్పటికీ తాను చెప్పాలనుకున్న విషయాల్ని చెప్పేయటమే తప్పించి.. విలేకరులకు ప్రశ్నలు అడిగే చాన్సులు ఇచ్చింది లేదు. అరకొర ప్రశ్నలకు సమాధానం ఇవ్వటమే తప్పించి.. కాస్తంత వివరంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వలేదు. 

చూస్తుండగానే ఐదేళ్ల ముఖ్యమంత్రి పదవీ కాలం పూర్తి అయ్యింది. వేళ్ల మీద లెక్కించే సార్లు మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టిన సీఎం జగన్.. తనను ప్రశ్నించే అవకాశాన్ని ఇవ్వలేదు. అంతేకాదు.. ప్రతి నెలలోనూ రెండు నుంచి నాలుగు వరకు బహిరం గసభల్ని ఏర్పాటు చేసేలా ప్లాన్ చేసిన ఆయన తాను చెప్పాలనుకున్న విషయాల్ని సదరు సభల్లో చెప్పుకొచ్చేవారు. తమ ప్రభుత్వ నిర్ణయాల్ని సైతం ఆయన ప్రజలకే నేరుగా చెప్పేసేవారు. అసెంబ్లీ వేదికగా చేసుకొని ప్రభుత్వ విధానాల్ని అందరికి తెలియజేసే వారు తప్పించి.. మీడియా ప్రతినిధుల్ని పిలిచి వారితో చిట్ చాట్ చేయటం.. వారి సలహాల్ని తీసుకోవటం.. పీడ్ బ్యాక్ అందుకోవటం లాంటివి చేసే వారు. ఎందుకిలా? 

అంటే సమాధానం ఉండదు. వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలోనూ ఆయనకు కొన్ని మీడియా సంస్థలు.. వాటి అధినేతలతో పేచీ ఉన్నప్పటికి ప్రెస్ మీట్లు.. విలేకరులతో చిట్ చాట్ లను మాత్రం యథావిధిగా నిర్వహించే వారు. అందుకు పూర్తి భిన్నంగా వైఎస్ జగన్ తీరు ఉండటం విశేషం. ఏమైనా.. మీడియా భేటీ ఏర్పాటు చేసి.. విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే పరిస్థితిని సీఎం జగన్ తెచ్చుకోలేదని చెప్పాలి. ఒక రకంగా ఇదో రికార్డుగా పలువురు అభివర్ణిస్తున్నారు.

WhatsApp "𝙋𝘼𝙎𝘾𝙃𝙄𝙈𝘼 𝙑𝘼𝙃𝙄𝙉𝙄" Group Join Now
Telegram Group Join Now