కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు: ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడిని ఖండిస్తూ ప్రత్తిపాడులో ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల యూనియన్ల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు.
ABN జర్నలిస్ట్ శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేసి, అనంతరం తహసీల్దార్ కి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్బంగా పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాప్తాడు ఘటనపై డీజీపీ నిందితులను తక్షణమే అరెస్టు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.