ప్రస్తుతం ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఆలీ మళ్లీ యాక్టివ్ అయ్యారు. వైసీపీ నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సు యాత్రలకు ఆలీ కూడా హాజరవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వైఎస్ జగన్ ను మరోసారి గెలిపించుకోవాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు, ముస్లింలకు సాధికారత కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగనే నని ఆలీ చెబుతున్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో ఆలీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారని టాక్. ఈ క్రమంలో ఆయన ముందు మూడు లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయని.. వీటిలో ఏదో ఒకటి తనకివ్వాలని జగన్ ను కోరనున్నారని తెలుస్తోంది.
గుంటూరు ఎంపీ సీటుపై మొదట ఆలీ ఆసక్తి చూపారు. అయితే ఆ సీటును కాపు సామాజికవర్గానికి చెందిన క్రికెటర్ అంబటి రాయుడికి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో ముస్లిం ఓటర్లు ఎక్కువ ఉన్న నంద్యాల, కర్నూలు ఎంపీ స్థానాల్లో ఏదొక స్థానం నుంచి పోటీ చేయాలని ఆలీ భావిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలనే ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ, పార్లమెంటు కలిపి 38 స్థానాల్లో మార్పులు చేశారు. ఇంకా మరికొన్ని స్థానాల్లోనూ మార్పులు ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ కొత్తవారికి ఇచ్చే అవకాశం ఉందని.. అదే జరిగితే ఆలీకి కూడా ఎంపీ సీటు దక్కితే ఆశ్చర్యపోనవసరం లేదని టాక్ నడుస్తోంది.