ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ రబీలో సాగునీటికి ఎటువంటి సమస్య రాకుండా చూడాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా ఇరిగేషన్, జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహించి అధికారులతో సమీక్షించడం జరిగిందన్నారు. జిల్లాలో రబీలో ఒక్క నీటి చుక్క కూడా వృధా కాకుండా పటిష్టమైన నీటి నిర్వహణ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.
నవంబర్ నెలాఖరు నాటికి నారుమళ్లు వేసుకునేలా అధికారులు రైతులను సమాయత్తం చేస్తారన్నారు. రబీలో సాగుకు, తాగునీటికి 91 టి. ఎం. సి., నీరు అవసరం అవుతుందని అంచనా వేయడం జరిగిందని, దీనిలో సీలేరు నుండి 40 టి. ఎం. సి.,లు గోదావరి జలాలు, 12 టి. ఎం. సి.,లు, ఇతర వనరుల ద్వారా 17 టి. ఎం. సి.,లతో అందుబాటులో ఉంటాయని, వీటితో పాటు పోలవరం ప్రాజెక్ట్ లో 25 టి. ఎం. సి.,లు నీటి నిల్వ సామర్ధ్యం పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.
వీటిలో తాగునీటికి 7 టి.ఎం. సి. లు వినియోగించడం జరుగుందన్నారు. జిల్లాలోని శివారు ప్రాంతాలకు కూడా సాగునీరు అందించేలా చెరువులు, కాల్వలలో కాల్వలలో తూడు, గుర్రపు డెక్క తొలగించడం, నీటి లీకేజీలను అరికట్టడం, షట్టర్లు మరమ్మత్తులు చేయించడం, కాల్వ గట్లు పటిష్టం చేయడం వంటి పనులను యుద్ధ ప్రతిపదికన చేపడుతున్నామన్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి అదే సీజన్లో నష్ట పరిహారం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. మెట్ట ప్రాంతంలో ప్రత్యామ్నాయంగా అపరాలు, తృణధాన్యాలు పండించేలా రైతులకు అవగాహన కలిగించాలని, విత్తనాలు అందించాలన్నారు. పంటను కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.