తాజాగా చక్కర్లు కొడుతున్న రెండు లేఖల్లోను ఏది కరెక్టో అర్ధంకాక జనాలు అయోమయానికి గురవుతున్నారు. అయితే రెండు లేఖలు కూడా ఫేక్ లెటర్లే అని టీడీపీ నెత్తి నోరు మొత్తుకుంటున్నది. తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ ఏ పార్టీకి మద్దతుగా పనిచేయటంలేదని అధికారికంగా ఖండిస్తున్నా జనాల్లో అయోమయమైతే తగ్గటంలేదు. ఎన్నికల్లో పోటీచేయకుండా టీడీపీ తప్పుకోవటమే ఈ అయోమయానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. పైగా టీడీపీ ఎన్నికల నుండి తప్పుకుని కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని స్వయంగా తనకు చంద్రబాబు చెప్పారని టీడీపీ అధ్యక్షుడిగా రాజీనామా చేయకముందు కాసాని జ్ఞానేశ్వర్ మీడియాతో చెప్పటం కూడా అయోమయానికి కారణమనే చెప్పాలి.
చంద్రబాబు మాటలను స్వయంగా కాసానే మీడియాతో చెప్పటంతో దాన్నే నిజమని జనాలు నమ్ముతున్నారు. అయితే కాంగ్రెస్ కు మద్దతుగా లేఖ వచ్చిందంటే అర్ధముంది. కానీ బీఆర్ఎస్ కు మద్దతుగా టీడీపీ అని ఒక లేఖలో ఉండటంతో జనాల్లో అయోమయం పెరిగిపోయింది. ఎన్నికల ఏదైనా సరే బీఆర్ఎస్, టీడీపీ కలుస్తాయని ఎవరు అనుకోవటంలేదు. కానీ ఇపుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు అంటే చంద్రబాబు అరెస్టుపై మంత్రి కేటీయార్ సానుకూలంగా స్పందించటం, అరెస్టును తప్పపడుతు మాట్లాడటం లాంటివి జరగటంతో ఏమో బీఆర్ఎస్ కు టీడీపీ మద్దతిచ్చిందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొత్తానికి ఇపుడు చక్కర్లు కొడుతున్న రెండు లేఖలు కూడా జనాల్లో అయోమయాన్ని పెంచేస్తుండటమైతే వాస్తవమనే చెప్పాలి. ఇవి ఫేక్ లెటర్లని టీడీపీ ఖండించినా దీని ప్రభావం ఎంతుంటుందన్నది చూడాల్సిందే.