Hot Posts

6/recent/ticker-posts

విశాఖ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా టి20 మ్యాచ్‌..


నవంబర్‌ 23న జరిగే ఇండియా–ఆస్ట్రేలియా టీ–20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బంధీగా నిర్వహిస్తామని ఆంధ్రక్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి శ్రీ ఎస్‌.ఆర్‌.గోపీనాథ్‌రెడ్డి వెల్లడించారు. మ్యాచ్‌ను దృష్టిలో ఉంచుకొని వైజాగ్‌లోని డా. వైఎస్సార్‌ ఏసీఏ, వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో మంగళవారం ఆర్గనైజింగ్‌ కమిటీ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఏసీఏ కార్యదర్శి ఎస్‌.ఆర్‌.గోపీనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ స్టేడియంలో పలు మ్యాచ్‌లను సమర్థవంతంగా నిర్వహించిన నేపథ్యంలో  విశాఖలో భారత్, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌ నిర్వహణకు బీసీసీఐ మరో ఆవకాశం కల్పించిందన్నారు. 


భవిష్యత్తులో మరిన్ని మ్యాచ్‌ల నిర్వహణకు బీసీసీఐ సన్నద్ధత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రతిమ్యాచ్‌ను విజయవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత నిర్వహణ కమిటీపై ఉందని పేర్కొన్నారు. మొట్ట మొదటి సారిగా ఈ మ్యాచ్‌ కోసం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రెసిడెంట్లు, సెక్రెటరీలను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఈ మ్యాచ్‌కు  సంబంధించి టిక్కెట్ల ధరలు, అమ్మకాలపై మరోసారి భేటీ అయి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. టికెట్ల విక్రయాలలో సామాన్యులకు పెద్ద పీట వేస్తూ చర్యలు తీసుకుంటామని తెలిపారు.


అదే విధంగా స్టేడియం సామర్థ్యం 27 వేల మందికే పరిమితం కావడంతో టికెట్‌ దొరకక పోవడంతో మ్యాచ్‌ ను తిలకించలేని క్రికెట్‌ అభిమానులు  నిరుత్సాహ పడకుండా సరికొత్త అనుభూతితో జిల్లా అధికారులతో అనుమతులు తీసుకొని విశాఖలో దాదాపు 10 వేల మంది మ్యాచ్‌ ను చూసేందుకు  బిగ్‌ స్క్రీన్‌ ఏర్పాటు చేసేందుకు  చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్వహణ కమిటీ వైస్‌ చైర్మన్‌ జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున మాట్లాడుతూ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై చర్చించామన్నారు. గతంలో జరిగిన మ్యాచ్‌ ల్లో కొన్ని లోటుపాట్లుపై కూడా చర్చించామని, అన్ని శాఖల సమన్వయంతో ఈ మ్యాచ్ను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. 


నగర పోలీస్‌ కమిషనర్‌ ఎ.రవి శంకర్‌ మాట్లాడుతూ గతంలో మ్యాచ్‌ సమయంలో తలెత్తిన ట్రాఫిక్‌ సమస్యలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి పకడ్బందీ చర్యలు చేపడతామన్నారు.  జివిఎంసి కమిషనర్‌ సాయి కాంత్‌ వర్మ మాట్లాడుతూ తాగునీరు, పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా జివిఎంసి ద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ఎ. మల్లికార్జున, సిటీ పోలీస్‌ కమిషనర్‌ ఎ.రవి శంకర్, జీవీఎంసీ కమిషనర్‌ సి.ఎం.సాయి కాంత్‌ వర్మ, ఏపీఈపీడీసీఎల్‌ చైర్మన్‌ పృధ్వి తేజ్, ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్‌ ఎ.అప్పలరాజు, ఏసీఏ ట్రెజరర్‌ ఎ.వి.చలం, సీఈవో ఎం.వి.శివారెడ్డితో పాటు అపెక్స్‌ కౌన్సిల్‌ మెంబర్లు, ఏసీఏ పుల్‌ మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.