Hot Posts

6/recent/ticker-posts

భీమడోలు మాధురి జూనియర్ కాలేజీలో బాలల హక్కులు, బాల్యవివాహాల నిరోధంపై అవగాహన సదస్సు


ఏలూరు/భీమడోలు మండలం: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, అమరావతి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, ఏలూరు వారి ఆదేశాల మేరకు భీమడోలు మండలంలోని మాధురి జూనియర్ కాలేజీలో బాలలకు చైల్డ్ రైట్స్ మరియు బాల్యవివాహాల నిరోధంపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు భీమడోలు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్ మరియు జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ఎస్. ప్రియదర్శిని నూతక్కి ఒక ప్రకటనలో తెలిపారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాలబాలికలకు మారుతున్న చట్టాలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో న్యాయ సేవాధికార సంస్థలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. అందులో భాగంగానే ఈ అవగాహన సదస్సు నిర్వహించబడిందని వివరించారు. “జాతీయ న్యాయ సేవాధికార బాలల స్నేహపూర్వక న్యాయ సేవలు–2024 పథకం” ప్రకారం గ్రామ గ్రామాల్లో ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కలిగించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

బాలలకు విద్యతో పాటు ఆరోగ్యం, సంరక్షణ, భద్రత వంటి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆమె తెలిపారు. అదే సమయంలో బాలలు కూడా తమ భద్రత పట్ల బాధ్యతతో వ్యవహరించాలని, ముఖ్యంగా రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నేటి సమాజంలో ఇంకా బాల్యవివాహాల వ్యవస్థ కొనసాగుతుండటం ఆందోళనకరమని, వాటిని అరికట్టేందుకు సమాజం మొత్తం కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.

ఈ అవగాహన సదస్సులో భీమడోలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీమతి గీతాంజలి, ప్యానల్ న్యాయవాది గంగరాజు, మాధురి విద్యాసంస్థల ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్‌తో పాటు విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.