ఏలూరు: వృద్ధులకు సేవ చేయడం పుణ్యకార్యమని ఏలూరు జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ అన్నారు. శనివారం మధ్యాహ్నం కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ , వారి సతీమణి డాక్టర్ మానస ఏలూరులోని ప్రేమాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ అనాధ వృద్ధులకు తోడూ, నీడై, ప్రేమ ఆప్యాయతానురాగాలను చవిచూపిస్తూ ఆశ్రయం కల్పిస్తున్న ప్రేమాలయం సేవలు ఎనలేనివని కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ ప్రశంసించారు.
ప్రేమాలయంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రేమాలయం ప్రాంగణంలో ప్రశాంత వాతావరణం నెలకొని ఉండటం ఆరోగ్యదాయకమని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రేమాలయం ప్రాంగణమంతా కలెక్టర్ దంపతులు పరిశీలించి చూశారు. సకల సౌకర్యాలతోపాటు, వైద్య ఆరోగ్య సదుపాయాలు కూడా కల్పిస్తూ, వృద్ధులను కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రేమాలయం కమిటీ ప్రతినిధులను ఈ సందర్బంగా కలెక్టర్ అభినందించారు.
ప్రేమాలయంలోని వృద్ధులు అందరికీ పెన్షన్లు అందుతున్నాయా? లేదా అని కలెక్టర్ ఆరా తీశారు. అందని వారికి పెన్షన్లు మంజూరు చేయించే చర్యలు తీసుకోవాలని తమ వెంట వచ్చిన ఏలూరు తహసిల్దార్ సోమశేఖర్ ను కలెక్టర్ ఆదేశించారు. మహాలయ అమావాస్య సందర్భంగా తమ తల్లిదండ్రుల పేరిట ప్రేమాలయంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. వృద్ధులకు కలెక్టర్ దంపతులు ఎంతో అప్యాతతో తమ స్వహస్తాలతో వడ్డన చేసి ఎంతో ఆనందం పొందారు. కలెక్టర్ వెంట ఏలూరు తహసిల్దార్ సోమశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుతగా ప్రేమాలయం కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ దంపంతులను సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ప్రేమాలయం కమిటీ గౌరవ అధ్యక్షులు టి వి సుబ్బారావు, కార్యదర్శి మురళీ కృష్ణ, కమిటీ సభ్యులు చెన్న వెంకట్రామయ్య, ఆలపాటి నాగేశ్వరరావు, గొర్ల రామారావు, కిరణ్, శేషగిరిరావు, చిత్రాలయ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.