తాజా వార్తలు

10/recent/ticker-posts

గేదెల దొంగతనం కేసు ఛేదన – నలుగురు అరెస్ట్


ఏలూరు జిల్లా, ద్వారకాతిరుమల, పశ్చిమ వాహిని, మార్చి, 22: పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన గేదెల దొంగతనం కేసును పోలీసులు ఛేదించి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసు క్రైమ్ నంబర్ 76/2026గా నమోదు చేయబడింది. ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి పావులవారిగూడెం గ్రామ పరిధిలోని ఒక కొబ్బరి తోటలో ఉన్న షెడ్డు నుండి రెండు గేదెలు, ఒక లేగదూడను దొంగిలించారని తిరుమలపాలెం గ్రామానికి చెందిన బోడ బ్రహ్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.


కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో విచారణ చేపట్టారు. భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. కృష్ణ ఆధ్వర్యంలో, ద్వారకాతిరుమల ఎస్ఐ టి. సుధీర్ సిబ్బందితో కలిసి సీసీ కెమెరా ఫుటేజ్, సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.

అరెస్టయిన నిందితులు మిడతా వెంకన్న, కడారి కృష్ణ, కడారి సురేష్, ఉప్పాటి సుబ్రహ్మణ్యం గా గుర్తించారు. వీరు చెడు వ్యసనాలకు అలవాటు పడి గేదెలను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది.

కేసు దర్యాప్తులో పాల్గొన్న భీమడోలు సీఐ, ద్వారకాతిరుమల ఎస్ఐ మరియు సిబ్బంది కృషిని ఉన్నతాధికారులు అభినందించారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న పశువులను యజమానికి తిరిగి అప్పగించే చర్యలు చేపట్టారు.