ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 22: రహదారి భద్రతపై వాహనదారుల్లో చైతన్యం కల్పించేందుకు కలపర్రు టోల్‌గేట్ వద్ద ప్రత్యేక హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్, పెదపాడు ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా బైక్ రైడర్లను ఆపి హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వారికి జరిమానాలు విధించకుండా, వారితోనే 50 హెల్మెట్‌లు కొనుగోలు చేయించి ధరింపజేశారు. హైవేపై హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రాణాపాయానికి దారితీస్తుందని వివరించారు. కారు డ్రైవర్లకు సీట్‌బెల్ట్ ధరించడం తప్పనిసరి అని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులు సురక్షితంగా ఇంటికి చేరాలని ఎదురుచూస్తుంటారని, అతివేగం మరియు నిర్లక్ష్యం ప్రమాదాలకు కారణమవుతాయని తెలిపారు. అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలని సూచించారు.








