నూజివీడు/ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 22: రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి కోసం బిసి రక్షణ చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎస్. సవిత తెలిపారు. నూజివీడు ఆర్.ఆర్.పేటలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న విగ్రహాన్ని మంత్రి సవిత, మంత్రి కొలుసు పార్థసారధితో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్రంలోని 139 బీసీ కులాలకు చట్టపరమైన రక్షణ కల్పించడం, వారికి ఆత్మవిశ్వాసం పెంపొందించడం బిసి రక్షణ చట్టం ప్రధాన లక్ష్యమని చెప్పారు. బీసీల అభివృద్ధికి గతంలో ఎన్‌టీఆర్ కృషి చేస్తే, ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
సూపర్ సిక్స్, ఎంఎస్ఎంఈల ద్వారా బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, మంత్రివర్గంలో కూడా బీసీలకు ప్రాతినిధ్యం పెంచినట్టు తెలిపారు. వడ్డే ఓబన్న స్వాతంత్ర్య పోరాటంలో చేసిన త్యాగాలు స్ఫూర్తిదాయకమని, ఆయన పోరాట స్ఫూర్తిని తరతరాలకు చేరవేయాలని అన్నారు.
మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోందన్నారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు సహాయం పెంపు, గౌడులకు రిజర్వేషన్లు, చేనేత కార్మికులకు విద్యుత్ రాయితీలు వంటి చర్యలను గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.








