తాజా వార్తలు

10/recent/ticker-posts

వేసవిలో త్రాగునీటి కొరత లేకుండా చర్యలు – జెడ్పీ చైర్‌పర్సన్ ఆదేశాలు


ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 22: రానున్న వేసవిలో ప్రజలకు త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, చెరువులను పూర్తిస్థాయిలో నింపుకోవాలని సూచించారు. ప్రస్తుతం ట్యాంకులు, చెరువుల్లో నీటి నిల్వలు ఉన్నప్పటికీ వేసవి అవసరాలను దృష్టిలో పెట్టుకుని కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని తెలిపారు. జల్ జీవన్ మిషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

కాలువల నీటి విడుదల నిలిపేలోపు మంచినీటి చెరువులను నింపేలా చర్యలు తీసుకోవాలని, శివారు ప్రాంతాలకు కూడా తగిన నీటి సరఫరా ఉండేలా పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా జిల్లాలో రోడ్ల మరమ్మత్తులు, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను భర్తీ చేసి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే రైతు సేవా కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్ర భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు.

సమావేశంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.14.07 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం లభించింది. అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.