ఏలూరు, పశ్చిమ వాహిని, మార్చి 23: ప్రజల ఫిర్యాదులను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించడమే లక్ష్యంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ స్వయంగా బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీతో పాటు అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు పాల్గొని ఫిర్యాదుదారులతో మాట్లాడారు. ఈ మొత్తం ప్రక్రియను పేపర్‌లెస్ విధానంలో, పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది.
నేడు అందిన ఫిర్యాదుల్లో భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆర్థిక మోసాలకు సంబంధించినవి అధికంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మొత్తం 43 ఫిర్యాదులు అందగా, వాటిపై చట్టప్రకారం వెంటనే విచారణ చేపట్టి నివేదికలు సమర్పించాలని ఎస్పీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా ప్రజలకు ఎస్పీ పలు సూచనలు చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా సబ్-డివిజన్, సర్కిల్ స్థాయిలోనే ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు. అలాగే meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని సూచించారు.
అదేవిధంగా ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవడానికి 1100 టోల్-ఫ్రీ నెంబర్‌ను ఉపయోగించుకోవాలని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సౌకర్యార్థం శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత భోజన సదుపాయం కల్పించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.








