వాడపాలెం, పశ్చిమవాహిని, మార్చి 18: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా కొనసాగుతోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. బుధవారం వాడపాలెంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించి పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధం చేసిన భోజనాన్ని ఎమ్మెల్యే పరిశీలించి, మెనూ అమలు మరియు ఆహార నాణ్యతపై ఆరా తీశారు. భోజనం నాణ్యతపై విద్యార్థులను ప్రశ్నించగా, వారు సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి, వారితో కలిసి భోజనం చేశారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఆహార నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు. భోజనం అనంతరం తన ప్లేట్‌ను స్వయంగా శుభ్రం చేసుకోవడం గమనార్హం.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరతాన్నధాత్రిగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందిస్తున్నట్లు తెలిపారు.
మెనూను కచ్చితంగా అమలు చేయడం ద్వారా విద్యార్థులకు సమతుల్య ఆహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.



.jpeg)








