నూజివీడు, పశ్చిమవాహిని, మార్చి 18: రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తన సొంత ఖర్చుతో సుమారు రూ.15 లక్షలు వెచ్చించి 1500 మంది ముస్లిం సోదర కుటుంబాలకు శారీస్ అందజేశారు.
నూజివీడు పట్టణంలోని 23వ వార్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, మంత్రి తన ఓఎస్డీ ప్రకాష్ రావు ద్వారా నూతన వస్త్రాలను పంపిణీ చేయించారు. దీంతో ముస్లిం సోదరులకు రంజాన్ పండుగకు ముందుగానే ఆనందాన్ని పంచినట్లు అయింది.
ఈ సందర్భంగా మంత్రి వర్చువల్ ద్వారా మాట్లాడుతూ రంజాన్ పండుగ శాంతి, సహనం, పరమత సహనం, క్రమశిక్షణకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఉపవాసం ద్వారా వ్యక్తిలో ఆత్మ నియంత్రణ పెంపొందుతుందని, ప్రేమ, త్యాగం, సహాయం వంటి విలువలు ముస్లిం సోదరుల జీవన విధానంలో ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.
ఖురాన్ అవతరించిన పవిత్రమైన రంజాన్ నెలలో ప్రతి ముస్లిం తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు పంచడం ద్వారా సమాజంలో సమానత్వం పెంపొందుతుందని తెలిపారు.
ఇటీవల రాష్ట్ర వక్ఫ్ బోర్డు నియమించిన షేక్ నిజాముద్దీన్ కమిటీ పనితీరును మంత్రి ప్రశంసించారు. కూటమి ప్రభుత్వంలో ముస్లిం సోదరుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు.
ముస్లింలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందని, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఎన్నికలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రను గుర్తు చేశారు. అలాగే ముస్లింల పవిత్ర యాత్ర మక్కా సందర్శనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు.
కానుకలు అందుకున్న ముస్లిం సోదరులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ముస్లిం మత పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



.jpeg)








