తాజా వార్తలు

10/recent/ticker-posts

ఎన్‌టీఆర్ జిల్లాలో పది తరగతి పరీక్షలు సజావుగా – కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ లక్ష్మీశ


ఎన్‌టీఆర్ జిల్లా, పశ్చిమ వాహిని, మార్చి 23: పది తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ సోమవారం నగరంలోని బోయపాటి శివరామకృష్ణయ్య మునిసిపల్ కార్పొరేషన్ హైస్కూల్, కర్నాటి రాంమోహనరావు మునిసిపల్ హైస్కూల్ పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.


పరీక్షా కేంద్రాల్లో వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు, వైద్య శిబిరం వంటి సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో మొత్తం 27,360 మంది విద్యార్థుల కోసం 149 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయడానికి అన్ని చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం పొందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

పరీక్షలను పూర్తిగా పారదర్శకంగా, బాధ్యతతో నిర్వహిస్తున్నామని, ప్రతి కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.