ఏలూరు, తడికలపూడి, పశ్చిమ వాహిని, మార్చి, 22: జిల్లా పోలీస్ శాఖ రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వినూత్న చర్యలు చేపడుతోంది. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్ ఆదేశాల మేరకు, ఇన్స్పెక్టర్ ఎం.వి. సుభాస్ ఆధ్వర్యంలో తడికలపూడి పోలీసులు కీలక భద్రతా ఏర్పాట్లు చేశారు.
తడికలపూడి ఎస్ఐ చిన్నారావు తన సిబ్బందితో కలిసి తడికలపూడి నుంచి కామవరపుకోటకు వెళ్లే ప్రధాన రహదారిపై ప్రమాదకర మలుపులు, చీకటి ప్రాంతాలను గుర్తించారు. ప్రమాదాల నివారణకు చర్యగా 15 రేడియం స్టిక్కర్లు అతికించిన ప్లాస్టిక్ డ్రమ్ములను వ్యూహాత్మకంగా ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ చిన్నారావు మాట్లాడుతూ, రాత్రి సమయంలో వాహనాల వెలుతురు పడినప్పుడు రేడియం స్టిక్కర్లు మెరిసి వాహనదారులకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. దీని వల్ల దూరం నుంచే మలుపులు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని చెప్పారు.
అదేవిధంగా, ఈ డ్రమ్ముల వల్ల వాహనదారులు తమ వేగాన్ని తగ్గించుకుని సురక్షితంగా ప్రయాణించవచ్చని సూచించారు. రహదారి భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, గమ్యస్థానానికి చేరే వరకు అప్రమత్తంగా వాహనాలు నడపాలని కోరారు.
రహదారిపై ఏర్పాటు చేసిన భద్రతా పరికరాలను ఎవరూ తొలగించవద్దని, ఇవి ప్రజల ప్రాణ రక్షణ కోసమే ఏర్పాటు చేసినవని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల ఈ చర్యను స్థానికులు, వాహనదారులు ప్రశంసిస్తున్నారు.








