నూజివీడు, పశ్చిమవాహిని, మార్చి 18: మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టి వ్యసనపరులను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఏపీ ఈగల్ చీఫ్ ఐజీపీ ఆకే. రవికృష్ణ, ఐపీఎస్ పేర్కొన్నారు. బుధవారం నూజివీడులోని బోస్కో డీ-అడిక్షన్ సెంటర్‌లోని నవజీవన్ బాల భవన్ పునరావాస కేంద్రాన్ని ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఐజీపీ మాట్లాడుతూ నవజీవన్ బాల భవన్ సొసైటీ అందిస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు. అక్కడ చికిత్స పొందుతున్న 16 మంది పిల్లలతో మాట్లాడి వారికి ధైర్యం నింపి, చెడు వ్యసనాలను విడిచిపెట్టి ఉన్నత లక్ష్యాల వైపు సాగాలని ప్రోత్సహించారు.
తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ 2012లో గుంటూరు ఎస్పీగా పనిచేసిన సమయంలో వీధి బాలల సమస్యను పరిష్కరించేందుకు “ఆపరేషన్ స్ట్రీట్ చిల్డ్రన్” చేపట్టి అనేక మందిని రక్షించి విద్యలో చేర్పించినట్లు వివరించారు. ఎవరూ రోడ్డుపై జీవించకూడదనే లక్ష్యంతో చర్యలు తీసుకున్నామని తెలిపారు.
డ్రగ్స్ సమస్యపై మౌనం ప్రమాదకరమని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానం వచ్చినా వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. “నైబర్‌హుడ్ పోలీసింగ్” ద్వారా ప్రతి పౌరుడు సమాజ భద్రతలో భాగస్వామి కావాలని అన్నారు.
విద్యార్థులు చిన్న అలవాట్లతో ప్రారంభించి డ్రగ్స్ వైపు మళ్లే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, డ్రగ్స్ వినియోగంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో సర్ప్రైజ్ చెక్స్ నిర్వహించి, అక్కడికక్కడే పరీక్షలు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఓపియాడ్ దుర్వినియోగం నియంత్రణకు “ఆపరేషన్ గరుడ”, విద్యాసంస్థలను పొగాకు రహితంగా మార్చేందుకు “ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్”, డ్రగ్స్ నియంత్రణకు “ఆపరేషన్ వజ్రప్రహార్” వంటి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వివరించారు. డ్రగ్స్ కేసుల్లో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఎన్‌డిపిఎస్ చట్టం ప్రకారం తీవ్రమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ, డీఎస్పీ, పోలీసు అధికారులు, ఈగల్ బృందం సభ్యులు పాల్గొన్నారు. నవజీవన్ బాల భవన్ నిర్వాహకులు, వైద్య సిబ్బంది, పిల్లలతో ఐజీపీ సమయం గడిపి వారికి పండ్లు పంపిణీ చేసి భోజనం చేశారు.



.jpeg)








