తాజా వార్తలు

10/recent/ticker-posts

పెదపాడులో రహదారి భద్రతపై అవగాహన – ఫ్లెక్సీలతో ప్రజల్లో చైతన్యం


ఏలూరు జిల్లా పెదపాడు, పశ్చిమ వాహిని, మార్చి, 22: సెంటర్‌లో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. “రహదారి భద్రత కేవలం నిబంధన కాదు, అది ప్రతి వాహనదారుడి ప్రాణ రక్షణ కవచం” అనే సందేశంతో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.


జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ పర్యవేక్షణలో పెదపాడు ఎస్ఐ ఆర్. శ్రీనివాస్ సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనదారులకు సులభంగా అర్థమయ్యేలా చిత్రాలతో ట్రాఫిక్ నిబంధనలు వివరించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్లక్ష్యం ప్రాణాలకు ప్రమాదమని హెచ్చరించారు. కుటుంబ సభ్యులు సురక్షితంగా ఇంటికి చేరాలని ఎదురు చూస్తారని గుర్తుచేస్తూ, అతివేగం మరియు అజాగ్రత్త వల్ల ప్రమాదాలు జరుగుతాయని తెలిపారు.

ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలని, రాంగ్ రూట్‌లో ప్రయాణించకూడదని సూచించారు. పోలీసుల కోసం కాదు, తమ ప్రాణ రక్షణ కోసం ట్రాఫిక్ నియమాలు పాటించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పోలీసులు వాహనదారులకు కరపత్రాలు పంపిణీ చేసి, నూతన మోటార్ వెహికల్ చట్టం ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు, భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.