భీమడోలు, పశ్చిమవాహిని, మార్చి 18: రహదారి ప్రమాదాల నివారణ లక్ష్యంగా భీమడోలు పోలీసులు నేషనల్ హైవేపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వాహనదారులకు అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.
భీమడోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణ, ఎస్ఐ షేక్ మదీనా బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ డ్రైవ్‌లో హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులను ఆపి వారికి అవగాహన కల్పించారు. జరిమానాలు విధించకుండా, సుమారు 50 మంది వాహనదారులతో హెల్మెట్లు కొనుగోలు చేయించి భద్రతపై దృష్టి సారింపజేశారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రహదారి ప్రమాదాల్లో ఎక్కువగా యువతే ప్రాణాలు కోల్పోతున్నారని, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలు ప్రాణాంతకంగా మారుతున్నాయని తెలిపారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, థ్రిల్ కోసం బైక్‌లను వేగంగా నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణాలని హెచ్చరించారు.
హెల్మెట్ ధరించడం ద్వారా తలకు గాయాలు తగ్గి ప్రాణాలు రక్షించుకోవచ్చని స్పష్టం చేశారు. కేవలం జరిమానాలు విధించడం కాకుండా, ప్రమాదాల వల్ల కుటుంబాలు ఎదుర్కొనే ఆవేదనను వివరించి వాహనదారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
పోలీసులు వాహనదారులకు పలు సూచనలు చేస్తూ ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వారు తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని, నిర్ణీత వేగ పరిమితులను పాటించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రయాణ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం ప్రమాదకరమని, ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని భీమడోలు పోలీసులు విజ్ఞప్తి చేశారు.



.jpeg)








