లక్కవరం, పశ్చిమవాహిని, మార్చి 18: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై లక్కవరం పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత ఆర్, ఐపీఎస్ పర్యవేక్షణలో ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఇన్‌స్పెక్టర్ ఎం.వి. సుభాస్ ఆధ్వర్యంలో, ఎస్‌ఐ జబ్బార్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్న వ్యక్తులను గుర్తించారు.
ఈ క్రమంలో బాకి రామకృష్ణ (నాగరాజు కుమారుడు), లక్కవరం గ్రామ నివాసిని జంగారెడ్డిగూడెం తహశీల్దార్ ఎదుట హాజరుపరచగా, అతనిపై రూ.1,00,000 (అక్షరాల లక్ష రూపాయలు) బైండోవర్ కేసు నమోదు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడకూడదని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ జబ్బార్ మాట్లాడుతూ పేకాట వంటి జూదాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఇటువంటి కార్యకలాపాలు ఆర్థిక నష్టంతో పాటు కుటుంబాలను సంక్షోభంలోకి నెడతాయని తెలిపారు.
బైండోవర్ అయిన వ్యక్తులు మళ్లీ అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొంటే, పూచీకత్తుగా ఉన్న మొత్తాన్ని జప్తు చేయడంతో పాటు కఠినమైన జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
గ్రామాల్లో ఎక్కడైనా పేకాట, గుండాట లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగితే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112 కు సమాచారం ఇవ్వాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని, చెడు ప్రభావాల నుండి వారిని దూరంగా ఉంచాలని సూచించారు. నేర రహిత సమాజం లక్ష్యంగా పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎవరినీ ఉపేక్షించబోమని అధికారులు స్పష్టం చేశారు.



.jpeg)








