అమరావతి, పశ్చిమ వాహిని, ఫిబ్రవరి 11: వైసీపీ అధినేత జగన్‌పై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క తిరుపతిలోనే కాదని.. అన్ని దేవాలయాల్లోనూ జగన్ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తుందని స్పష్టం చేశారు. అన్ని మతాల సెంటిమెంట్లు ముఖ్యమన్న విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలని సూచించారు. వైసీపీ హయాంలో రామ తీర్థంలో రాముడి తల నరికారని ఆగ్రహించారు.
అసెంబ్లీకి అందరూ రావాల్సిందే..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అసెంబ్లీ సమావేశాలకు ప్రతి ఒక్కరూ ఉదయం 9:00 గంటలకు అందరూ హాజరు కావాల్సిందే. ఉదయం 9:00 గంటల నుంచి 10:00 గంటల వరకే ప్రశ్నోత్తరాలు ఉంటాయి. నేను ప్రతి ఒక్కటీ గమనిస్తూనే ఉన్నా.. కూటమి పక్షాల అధినేతలుగా ఉన్న మా మధ్య ఎలాంటి విభేదాలూ లేవు. మేమంతా ఐక్యతగా ఉన్నాం. అభివృద్దే మా లక్ష్యం. 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలను పిలిపించుకుని వారితో మాట్లాడి, వారి పనితీరును సమీక్షిస్తాం. మేం పరిష్కరించాల్సిన సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండి’ అని చెప్పారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండాలి..
టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు నోరుజారి మాటాడవద్దు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. ‘మనం 5 కోట్ల మంది ప్రజలకు జవాబుదారీ అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. ప్రతి రోజు అందరూ అసెంబ్లీ కు రావాల్సిందే. గవర్నర్ ప్రసంగం నేను రెండున్నర గంటలు స్టడీ చేశాను. ఇప్పటివరకు మనం చేసిన అభివృద్ది పనుల గురించి చర్చించాల్సిన అవసరముంది. జాతీయ రహదారులు మన రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. రైల్వేకు సంబంధించి రూ.90 వేల కోట్ల పనులు సాగుతున్నాయి. మీ నియోజకవర్గాలకు సంబంధించిన పనులేమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి. కేంద్ర ప్రభుత్వం.. మన రాష్ట్రం పట్ల చాలా పాజిటివ్‌గా ఉంది. విశాఖ స్టీల్ గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.450 కోట్లు నష్టంలో ఉంది. కానీ ఈ ఏడాది ఆ నష్టాన్ని పూరించి రూ.50 కోట్ల లాభంలోకి వచ్చింది’ అని అన్నారు.







