Hot Posts

6/recent/ticker-posts

అర్జీలను పలు మార్లు పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలి : జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి


ఏలూరు, డిసెంబరు 15 : జిల్లా కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లా స్థాయి అధికారులతో కలిసి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వర రావు, ఆర్డీవో ఎం. అచ్యుత అంబరీష్, డిప్యూటీ కలెక్టర్ ఎల్. దేవకిదేవి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఒకటికి నాలుగు సార్లు పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల అర్జీలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, వారి చెంతకే వెళ్లి అర్జీలను స్వీకరించి సమస్యలను స్వయంగా తెలుసుకుంటే వారికి భరోసా కలుగుతుందని పేర్కొన్నారు.

తమ శాఖ పరిధిలో లేని అర్జీలు వచ్చినట్లయితే వాటిని వెంటనే సంబంధిత శాఖ అధికారులకు పంపించాలని, అలసత్వం లేదా నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి క్లిష్టమవుతుందని హెచ్చరించారు. అధికారులు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని, ఒకే అర్జీ పునరావృతం కాకుండా నాణ్యతతో నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ రోజు పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 294 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వచ్చిన కొన్ని అర్జీల వివరాలు ఇలా ఉన్నాయి. దెందులూరు మండలం రామారావు గూడెంకు చెందిన అరిగెల అమరనాథ్ తనకు చెందిన 2.44 ఎకరాల పంటభూమిని ఆన్‌లైన్ రికార్డుల్లో నమోదు చేయాలని కోరారు. నూజివీడు మండలం మొఖాసానరసన్నపాలెం గ్రామానికి చెందిన నువ్వుల రామమోహన రావు రీ సర్వే అనంతరం తన భూమిలో 10 సెంట్లు తక్కువగా చూపించారని, న్యాయం చేయాలని అభ్యర్థించారు. 

బుట్టాయిగూడెం మండలం చీమలవారిగూడెం గ్రామానికి చెందిన అన్నిక వెంకటలక్ష్మి తన పట్టా భూమిలో అనుమతి లేకుండా రహదారి నిర్మాణం జరుగుతోందని ఫిర్యాదు చేశారు. వేలేరుపాడు మండలం ఒంటిబండ గ్రామానికి చెందిన కుంజా రామకృష్ణ తాము ఆదివాసీ గిరిజన కుటుంబాలకు చెందినవారమని, 2005 నుంచి సాగు చేస్తున్న భూములకు అటవీ హక్కు చట్టం ప్రకారం హక్కు పత్రాలు మంజూరు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జిల్లా కలెక్టరేటు పరిపాలన అధికారి ఎన్.వి. నాంచారయ్య, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.